మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రూ.లక్షన్నర కోట్ల భూములపై రేవంత్‌రెడ్డి కన్ను: కేటీఆర్
వేలమంది ఇళ్లు కూల్చి వాటి పునాదులపై మూసీ ప్రణాళిక అంటే ఒప్పుకోం
మేము ఒక్క ఇంటినీ కూల్చకుండా 6 కి.మీ. అభివృద్ధి చేశాం
మూసీకి వ్యతిరేకం కాదు.. జరిగే అవినీతి, ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటాం
‘మూసీ–పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్’లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్‌ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు..
ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు.
రూ.లక్షన్నర కోట్లు ఎందుకు?
నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్‌రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.
మా అంచనా వ్యయం 16 వేల కోట్లు
గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు.
బఫర్ జోన్‌తో భయపెట్టి..
ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్‌లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్‌లో ఉంది. మంత్రుల ఫామ్‌హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.
3,300 ఎకరాలపై కన్నేసి..
రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


