వేతనాల కోసం హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు
- ఆందోళనలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు
- 6 నెలలకుపైగా నిలిచిన చెల్లింపులు
- జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో 9 నెలలుగా అందని దైన్యం
- ఏజెన్సీల వల్లే అంటూ మండిపాటు
- ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని ఉన్నతాధికారులు
- చాలా చోట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు
- పగలు, రాత్రిపూట కార్యాలయాల ఆవరణలోనే పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా...ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరకొర వేతనాలు ఇస్తున్నప్పటికీ... వాటిని నెలల తరబడి చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని, కుటుంబ సభ్యులు పస్తులుండాల్సి వస్తోందంటూ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు అందకపోవడంతో సంక్రాంతి పండుగ సైతం జరుపుకునే పరిస్థితి లేదంటూ తమ దీన స్థితిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున రూ.22 వేల నుంచి రూ.31వేల వరకు ప్రభుత్వం వేతనాల రూపంలో చెల్లిస్తుండగా... పన్నులు, ఇతరత్రా కోతలు పోగా చేతికందేది కేవలం రూ.13వేల నుంచి రూ.20వేలు మాత్రమే. ఈ వేతనాలు సైతం నెలలుగా చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
ఏజెన్సీల చేతిలో మాయ: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో ఏజెన్సీ పాత్రే కీలకం. ఉద్యోగుల వేతన నిధులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు కాకుండా సంబంధిత ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఆ నిధుల నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్, జీఎస్టీ, ఏజెన్సీ కమిషన్, ఇతర పన్నుల కింద చేయాల్సిన చెల్లింపులను పూర్తి చేసిన తర్వాత మిగులును మాత్రమే ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... చెల్లింపులు చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, సచివాలయంలోని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో పెద్దగా జాప్యం లేనప్పటికీ... జిల్లాలు, మండల స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వేతన చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. కొన్నిచోట్ల 9 నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు తమ వేతన చెల్లింపుల జాప్యంపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు చాలా చోట్ల క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు ముగిసినా వేతనాలు చెల్లించనందున కార్యాలయ ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసనలకు దిగుతున్నారు.
ఇదీ పరిస్థితి...
⇒ నీటి పారుదల శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 6నెలలుగా వేతనాలు విడుదల కాలేదని అక్కడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.
⇒ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆయా ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సైతం చెల్లించలేదు.
⇒ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 339 మంది ఉద్యోగులకు 7నెలలుగా వేతనాలు అందలేదు.
⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఆరునెలలుగా, ఎస్సీ వసతి గృహాల్లో పని చేస్తున్న వాచ్‌మెన్, కామాటిలకు 9నెలలుగా వేతనాలు అందలేదు.
⇒ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 770 మంది ఉద్యోగులకు 5నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది.
⇒ ఎస్సీ గురుకుల సొసైటీలో ఐఎఫ్‌ఎంఎస్‌లో రిజి్రస్టేషన్ కాకపోవడంతో ఆర్నెళ్ల వేతనాలు నిలిచిపోయాయి.
⇒ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తాం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించాలి. ఒక్క నెల కూడా పెండింగ్‌లో పెట్టొద్దు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేర్లు ఐఎఫ్‌ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం) పోర్టల్‌లో ఎక్కించలేదనే కారణంతో జీతాలు నిలిపివేశారు. ఏ కారణం ఉన్నా జీతాలు ఆపేందుకు వీలు లేదు. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఏజెన్సీ విధానాన్ని మార్చి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి మాకు వేతనాలు చెల్లించాలి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం
19 రోజులుగా సమ్మె చేస్తున్నాం
మాకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నాం. వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉద్యోగులెవరైనా ఒక్క నెల జీతం ఆలస్యమైతేనే అల్లాడిపోతారు. అలాంటిది మాకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి? జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి విసుగెత్తాం.అందుకే మున్సిపాలిటీల ముందు సమ్మెకు దిగాం. 19 రోజులుగా నిరసన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. – శంకరమ్మ, స్వీపర్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ


