ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 37 శాతం ఉత్తీర్ణతే
బట్టీ పట్టించడంతో ప్రైవేటులో 64 శాతం
గురుకులాల్లో అత్యధికంగా 78 శాతం
ప్రక్షాళన చేయకుంటే ఇంటర్ విద్య అయోమయం
రాష్ట్ర విద్యా కమిషన్ నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర విద్యా కమిషన్ తన నివేదికలోనూ ఇదే పేర్కొంది. ప్రభుత్వ కాలేజీల్లో బోధనాపరమైన నిర్లక్ష్యం, ప్రైవేటు కాలేజీల్లో ఒత్తిడితో కూడుకున్న విద్య ఉంటోంది. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ప్రైవేటులో బట్టీ చదువుల విధానంలో ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవుతున్నా.. సాంకేతిక విద్యలో ఇలాంటి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఒత్తిడి కారణంగా వెనుకబడుతున్నారు. సబ్జెక్టుపై పట్టులేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఐఐటీ ముంబై అధ్యయనంలో వెల్లడైంది.
గురుకుల విద్య మెరుగే..
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 10,96,666 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో 1,84,743 మంది ఉంటే, ప్రైవేటులో 7,20,674 మంది ఉన్నారు. గురుకులాల్లో 1,00,644 మంది చదివారు. ప్రభుత్వ కాలేజీల్లో 37 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రైవేటులో 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే, గురుకులాల్లో ప్రైవేటు కన్నా ఎక్కువగా 78 శాతం మంది పాసయ్యారు.
జేఈఈ, నీట్‌లో కూడా గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. జాతీయ కాలేజీల్లో సీట్లు పొందినప్పటికీ ఒత్తిడికి గురికావడం లేదని ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో తేలింది. దీన్నిబట్టి ఒత్తిడిలేని గురుకుల తరహా విద్యా విధానం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పర్యవేక్షణే మందు..
ప్రభుత్వ కాలేజీల్లో నవంబర్ నాటికి మొత్తం సిలబస్ పూర్తవ్వడం లేదు. అధ్యాపకులకు ఎన్నికల విధులు ఉండటం, చాలాచోట్ల సబ్జెక్టు ఫ్యాకల్టీ కొరత, కాలేజీలు సరిగా జరగకపోవడం కారణాలైతే... విద్యార్థుల హాజరు శాతం కూడా తక్కువగా ఉంటోంది. ఈ ఏడాది నుంచి ముఖ గుర్తింపు విధానం తేవడంతో కొంత మార్పు కన్పిస్తోంది.
అయితే, క్లాసులకు హాజరవ్వని విద్యార్థులను ప్రిన్సిపల్స్ ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండటం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారు పనులకు వెళ్తున్నట్టు పలువురు ప్రిన్సిపల్స్ చెప్పారు. ప్రధానంగా ఇలాంటి పరిస్థితులను పర్యవేక్షణలో సరిచేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
మార్పులు తెస్తున్నాం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ పెట్టాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి కాలేజీలను నిత్యం గమనిస్తున్నాం. దీనివల్ల హాజరు శాతం పెరుగుతోంది. ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నాం. ఇంటర్మీడియెట్ విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఈ ఏడాది మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. – కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి


