ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు నుంచి మెడ గాయం కారణంగా ఆర్ధరాంతరంగా వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు జట్టుతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే గిల్ దాదాపుగా గౌహతి టెస్టుకు దూరమైనట్లే. అతడి స్ధానంలో సాయిసుదర్శన్‌ను తుది జట్టులోకి రానున్నాడు.
వన్డేలకు దూరం?
ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్‌కు సౌతాఫ్రికాతో వన్డేలకు కూడా విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం కానున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.
దీంతో అతడిని ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ యోచిస్తోంది. వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు కూడా సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
ఈ క్రమంలో సఫారీలతో వన్డే సిరీస్‌లో భారత పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ వన్డే సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. వన్డే జట్టులోకి యశస్వి జైశ్వాల్, సాయిసుదర్శన్‌లు రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా నవంబర్ 30 నుంచి రాంఛీ వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: రెండో టెస్టులో ఆడాలని ఉన్నా...


