ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్’గా గుర్తింపు పొందింది.
యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎనీ్వలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది.
పెరిగిన స్థాయి
శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్ రీజియన్ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్‌వీలకే పరిమితం కాదు. సీబీఎస్‌ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యాన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే అండర్ –19 జాతీయ పోటీలకు జేఎన్‌వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్ జేఎన్‌వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల.
అవకాశాలు వదలొద్దు: శ్రీవల్లి
కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు.


