టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ప్రకటించిన భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. అప్పటిదాకా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిపై మెగా ఈవెంట్‌కు ముందు వేటు పడింది. అయితే, అందుకు గిల్ వరుస వైఫల్యాలే కారణం.
దాదాపు ఏడాది పాటు టెస్టు, వన్డేలతో బిజీగా ఉన్న గిల్ (Shubman Gill).. ఆసియా కప్-2025తో టీమిండియా తరపున టీ20 క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. అతడి రాకతో అప్పటిదాకా అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా కొనసాగిన సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. మరోవైపు.. గిల్ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు.
గిల్‌ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలు
ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా.. వరల్డ్‌కప్ జట్టు నుంచి గిల్‌ను తప్పించిన యాజమాన్యం.. సంజూను ఓపెనర్‌గా బరిలో దించుతామని చెప్పకనే చెప్పింది. అయితే, వైస్ కెప్టెన్‌ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గిల్‌కు ఇంకాస్త సమయం ఇవ్వాల్సిందని.. భవిష్య కెప్టెన్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. గిల్‌ను తప్పించి మంచి పనిచేశారని మరికొందరు మాజీలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఏకంగా జట్టు నుంచే తప్పిస్తారా?
‘‘శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్. కేవలం 4-5 ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడని అతడిని జట్టు నుంచే తప్పిస్తారా? వందకు పది మాత్రమే సరిగ్గా ఆడిన ఎంతో మంది క్రికెటర్లకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలాంటి వాళ్లలో కొందరు ఇంకా ఆడుతున్నారు.
అతడిపైనా వేటు వేస్తారా?
ఇందుకు కారణమేంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువకుడైన అభిషేక్ శర్మ రెండేళ్ల క్రితం జట్టులోకి దూసుకువచ్చాడు. ఒకవేళ ఈ విధ్వంసకర ఓపెనర్‌గా నాలుగు ఇన్నింగ్స్‌లో గనుక విఫలమైతే.. అతడిపైనా వేటు వేస్తారా?’’ అని యోగ్‌రాజ్ సింగ్ టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు.
కపిల్ దేవ్‌కు వరుస అవకాశాలు
ఈ సందర్భంగా భారత దిగ్గజం కపిల్ దేవ్ పేరును ప్రస్తావిస్తూ.. ‘‘మీ దృష్టిలో ‘గొప్పవాడైన’ కపిల్ దేవ్‌నే ఉదాహరణగా తీసుకుందాం. బిషన్ సింగ్ బేడీ కెప్టెన్సీలో మేము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినపుడు.. కపిల్ దేవ్ వరుసగా విఫలమవుతున్నా.. అన్ని మ్యాచ్‌లు ఆడాడు.
అయినా సరే బిషన్ సింగ్ అతడిని ఇంగ్లండ్ టూర్‌కు కూడా తీసుకువెళ్లాడు. మరి గిల్ విషయంలో ఎందుకిలా?’’ అని యోగ్‌రాజ్ సింగ్ ప్రశ్నించాడు. రవిబిస్త్ ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా తనను తొక్కేశాడని కపిల్ దేవ్‌ను.. తన కుమారుడు యువీ కెరీర్‌ను నాశనం చేశారంటూ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిలను యోగ్‌రాజ్ తరచూ విమర్శిస్తూ ఉంటాడు. అయితే, అతడు చెప్పినట్లు ఇప్పుడు గిల్ కేవలం 4-5 ఇన్నింగ్స్‌లో కాదు.. దాదాపు ఇరవైకి పైగా ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకుండా విమర్శలు మూటగట్టుకున్నాడు.
చదవండి: IND vs NZ: పంత్‌పై వేటు.. దేశీ ‘హీరో’ ఎంట్రీ!.. సిరాజ్‌కు చోటిస్తారా?


