ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం డేమియన్ మార్టిన్ (54) ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. మెనినైటిస్‌తో బాధపడుతూ ఇటీవల కోమాలోకి వెళ్లిన ఆయన.. ఆశ్చర్యకర రీతిలో కోమా నుంచి బయటపడ్డాడు. మార్టిన్ ఆరోగ్యం అద్భుత రీతిలో పురోగతి సాధించింది. గంట గంటకు ఇంకా మెరుగవుతున్నాడని డాక్టర్లు చెప్పారు.
మార్టిన్ ఆరోగ్యం ఆశ్చర్యకర రీతిలో పురోగతి సాధిస్తుండటాన్ని అతని స్నేహితుడు, ఆసీస్ దిగ్గజ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 'మిరాకిల్'గా అభివర్ణించాడు.
గిల్లీ మాటల్లో.. గత 48 గంటల్లో మార్టిన్ ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగు పడింది. అతని ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కోమా నుంచి బయట పడిన తర్వాత మార్టిన్ అసాధారణంగా స్పందిస్తున్నాడు. స్పందించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. త్వరలోనే అతన్ని ICU నుంచి బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, గిల్‌క్రిస్ట్ గత కొన్ని రోజులుగా మార్టిన్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.
అభిమానులకు కృతజ్ఞతలు
మార్టిన్ ఆశ్చర్యకర రీతిలో కోలుకుంటున్న నేపథ్యంలో అతని భార్య అమాండా తొలిసారి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, శ్రద్ధ వల్ల మార్టిన్ కోలుకుంటున్నాడని అంది. మార్టిన్ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. అభిమానుల సందేశాలు, మీడియా ద్వారా వచ్చిన మద్దతు మార్టిన్‌కు బలాన్నిచ్చాయని పేర్కొంది. కష్ట సమయంలో అండగా ఉన్న వారందకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపింది.
సొగసైన బ్యాటర్‌గా పేరొందిన డేమియన్ మార్టిన్ 1992 నుంచి 2006 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.
మార్టిన్ ఇటీవల జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్టిన్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉన్నాడు.


