ఈసారి ‘షూటౌట్‌’లో... | India suffers sixth consecutive defeat in Pro Hockey League | Sakshi
Sakshi News home page

ఈసారి ‘షూటౌట్‌’లో...

Feb 23 2026 4:10 AM | Updated on Feb 23 2026 4:10 AM

India suffers sixth consecutive defeat in Pro Hockey League

ప్రొ హాకీ లీగ్‌లో భారత్‌కు వరుసగా ఆరో పరాజయం

హోబర్ట్‌: వేదిక మారినా... ప్రత్యర్థులు మారినా... కెప్టెన్సీ మారినా... తాజా సీజన్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ప్రొ లీగ్‌ రెండో అంచె పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన భారత హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. భారత్‌ వేదికగా జరిగిన తొలి అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమిండియా... ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన సీజన్‌ ఆరో మ్యాచ్‌లో హార్దిక్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా ‘షూటౌట్‌’లో 4–5 గోల్స్‌ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 

నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ను నిర్వహించారు. ‘షూటౌట్‌’లో ఆ్రస్టేలియా తరఫున టిమ్‌ బ్రాండ్, లియామ్‌ హెండర్సన్, టిమ్‌ హోవర్డ్, జాక్‌ వెల్‌్చ, టామ్‌ క్రెయిగ్‌ గోల్స్‌ చేశారు. భారత్‌ తరఫున శిలానంద్‌ లాక్రా, మణీందర్‌ సింగ్, రాజ్‌కుమార్‌ పాల్, జుగ్‌రాజ్‌ సింగ్‌ గోల్స్‌ సాధించగా... ఆదిత్య అర్జున్‌ తీసుకున్న చివరిదైన ఐదో షాట్‌ను ఆస్ట్రేలియా గోల్‌కీపర్‌ జేడ్‌ స్నోడెన్‌ అడ్డుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. 

అంతకుముందు నిర్ణీత సమయంలో భారత్‌ తరఫున అమిత్‌ రోహిదాస్‌ (15వ నిమిషంలో), జుగ్‌రాజ్‌ సింగ్‌ (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా... ఆ్రస్టేలియా జట్టుకు జోయెల్‌ రింటాలా (47వ, 56వ నిమిషంలో) రెండు గోల్స్‌ అందించాడు. స్పెయిన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 0–2తో ఓడిన భారత్‌ ఈ మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబరిచింది. ఒకదశలో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లి తొలి విజయం దిశగా సాగిపోయింది. అయితే చివర్లో తప్పిదాలు చేసి తొమ్మిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ సమర్పించుకుంది. 

మ్యాచ్‌లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను భారత్‌ సది్వనియోగం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా 14 పెనాల్టీ కార్నర్‌లు సంపాదించినా... రెండింటిని మాత్రమే లక్ష్యానికి చేర్చింది. ‘షూటౌట్‌’లో ఓడినందుకు భారత జట్టుకు ఒక్క పాయింట్‌... ఆ్రస్టేలియాకు రెండు పాయింట్లు లభించాయి. నిర్ణీత సమయంలో విజయం సాధిస్తే మూడు పాయింట్లు దక్కుతాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌లో స్పెయిన్‌ జట్టుతో భారత్‌ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి ఒక్క పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement