మెయిన్‌ ‘డ్రా’కు రామ్‌–జీవన్‌ జోడీ | Ramkumar Ramanathan and Jeevan in the mens doubles category of the Dubai Open | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు రామ్‌–జీవన్‌ జోడీ

Feb 23 2026 4:04 AM | Updated on Feb 23 2026 4:04 AM

Ramkumar Ramanathan and Jeevan in the mens doubles category of the Dubai Open

న్యూఢిల్లీ: దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో రామ్‌కుమార్‌ రామనాథన్‌–జీవన్‌ నెడుంజెళియన్‌ (భారత్‌) జోడీ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం దుబాయ్‌లో జరిగిన క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌–జీవన్‌ ద్వయం 6–4, 7–6 (7/4)తో కారోల్‌ ద్రెజెవ్‌స్కీ–పీటర్‌ మతుజెవ్‌స్కీ (పోలాండ్‌) జంటను ఓడించింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 

తొలి సర్వీస్‌లో 42 పాయింట్లు, రెండో సర్వీస్‌లో ఎనిమిది పాయింట్లు సాధించింది. తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రామ్‌–జీవన్‌ 6–5, 7–6 (7/4) స్కోరుతోనే భారత్‌కే చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌లపై గెలుపొందడం విశేషం. డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో యూకీ బాంబ్రీ (భారత్‌)–గొరాన్‌సన్‌ (స్వీడన్‌); శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–ఒబెర్‌లీట్నెర్‌ (ఆ్రస్టియా) జోడీలు కూడా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement