ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2025-26 ఎడిషన్ టైటిల్‌ను డెజర్ట్ వైపర్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో MI ఎమిరేట్స్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసి తమ తొలి DP వరల్డ్ ILT20 టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ గెలుపుతో వైపర్స్ 7 లక్షల యూఎస్ డాలర్ల నగదు బహుమతి సహా బ్లాక్ బెల్ట్‌ను అందుకుంది. రన్నరప్ MI ఎమిరేట్స్‌కు 3 లక్షల యూఎస్ డాలర్ల నగదు బహుమతి లభించింది.
కర్రన్ వన్ మ్యాన్ షో
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. కెప్టెన్ సామ్ కర్రన్ (51 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ద సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మ్యాక్స్ హోల్డన్ (41) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. డాన్ లారెన్స్ 23, ఫకర్ జమాన్ 20, జేసన్ రాయ్ 11 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 2, అరబ్ గుల్ ఓ వికెట్ తీశారు.
అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఎం జట్టు ఆదిలోనే చేతులెత్తేసింది. నసీం షా (4-0-18-3), డేవిడ్ పేన్ (4-0-42-3), ఖుజామియా తన్వీర్ (3.3-0-22-2), ఉస్మాన్ తారిక్ (4-0-20-2) ధాటికి 18.3 ఓవర్లలో 136 పరుగులకే చాపచుట్టేసింది.
ఎంఐ ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (28), ముహమ్మద్ వసీం (26), తేజిందర్ డిల్లాన్ (12), ఆండ్రీ ఫ్లెచర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.
టోర్నీ ఆధ్యాంతం ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టిన సామ్ కర్రన్ (97 పరుగులు, 7 వికెట్లు, 10 క్యాచ్‌లు) రెడ్ బెల్ట్ (MVP), గ్రీన్ బెల్ట్ (Best Batter) గెలుచుకున్నాడు. వకార్ సలాంఖిల్ (Dubai Capitals)– వైట్ బెల్ట్ (Best Bowler, 18 వికెట్లు), ముహమ్మద్ వసీమ్ (MI Emirates– బ్లూ బెల్ట్ (Best UAE Player, 370 పరుగులు) గెలుచుకున్నారు.


