దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2025-26 ఎడిషన్ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-1లో గెలిచి డెజర్ట్ వైపర్స్ నేరుగా ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. మరో ఫైనల్ బెర్త్ కోసం పోటీ కొనసాగుతుంది.
నిన్న (జనవరి 1) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ దుబాయ్ క్యాపిటల్స్‌పై తిరుగులేని విజయం సాధించి, ఇవాళ జరుగబోయే క్వాలిఫయర్స్-2కు (ఎంఐ ఎమిరేట్స్‌తో) అర్హత సాధించింది. క్వాలిఫయర్-2 విజేత జనవరి 4న జరిగే ఫైనల్లో డెజర్ట్ వైపర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌పై అబుదాబీ నైట్‌రైడర్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. మైఖేల్ పెప్పర్ (49 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (43), ఆఖర్లో జేసన్ హోల్డర్ (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్యాపిటల్స్ బౌలర్లలో నబీ 3 వికెట్లతో సత్తా చాటగా.. హైదర్ అలీ, వకార్ సలాంఖిల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన క్యాపిటల్స్.. 16.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సునీల్ నరైన్ (3-0-12-3), జేసన్ హోల్డర్ (3.2-0-18-3), లివింగ్‌స్టోన్ (4-0-26-3) అద్భుతంగా బౌలింగ్ చేసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన నబీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


