ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. ఎమిరేట్స్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. డిసెంబర్ 30న జరగనున్న క్వాలిఫైయర్ 1లో 'డెజర్ట్ వైపర్స్' జట్టుతో ఎమిరేట్స్ తలపడనుంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ బౌలర్ల ఆరంభం నుంచే ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించారు. స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. షకీబ్, మౌస్లీ, ఫరూఖీ తలా వికెట్ సాధించారు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ నబీ(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
పొలార్డ్ విధ్వంసం..
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమిరేట్స్‌కు ఓపెనర్లు మహమ్మద్ వసీం (27), ఆండ్రీ ఫ్లెచర్ (21) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఫ్లెయర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.
అబుదాబి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ వకార్ సలాంఖైల్‌కు చుక్కలు చూపించాడు. 14 ఓవర్ వేసిన సలాంఖైల్ బౌలింగ్‌లో పొలార్డ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో కిరాన్ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు.
ఈ ఒక్క ఓవర్‌తోనే మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. ఫలితంగా 123 పరుగుల లక్ష్యాన్ని ఎమిరేట్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పొలార్డ్ మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.


