సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదుర్కొని ఎలిమినేషన్ అంచున ఉన్న ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు (MI Cape town) దిగ్గజ టీ20 ఆటగాడు కీరన్ పోలార్డ్ జీవం పోశాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ జాతీయ విధుల కోసం జట్టును వీడటంతో, అతని స్థానాన్ని భర్తీ చేసిన పోలీ.. నిన్న (జనవరి 16) సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై ఎంఐ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.
అప్పటికి 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండిన కేప్‌టౌన్.. పోలార్డ్ రాకతో తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పార్ల్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్ కోసం ఎం కేప్‌టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.
సన్‌రైజర్స్‌పై పోలార్డ్ తొలుత బంతితో (2-0-9-0), ఆతర్వాత బ్యాట్‌తో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో కేప్‌టౌన్ ఈస్ట్రన్‌కేప్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్రన్‌కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. కేప్‌టౌన్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు వికెట్లతో సత్తా చాటిన కేప్‌టౌన్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
బాష్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-28-3), రబాడ (3-0-20-1), జార్జ్ లిండే (4-0-34-1) సత్తా చాటడంతో ఈస్ట్రన్‌కేప్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో మార్కో జన్సెన్ (42) రాణించడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈస్ట్రన్‌కేప్‌లో స్టార్ బ్యాటర్లు డికాక్ (0), బెయిర్‌స్టో (15), స్టబ్స్ (4) విఫలయ్యారు.
ఛేదనలో కేప్‌టౌన్ కూడా తడబడింది. జన్సెన్ (4-0-23-2), ముత్తుసామి (3.2-0-25-2), నోర్జే (4-0-29-1), మిల్నే (3-0-26-1), కోల్స్ (2-0-13-1) సత్తా చాటి కేప్‌టౌన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే కీలక దశలో లిండే (31), పోలార్డ్ (20) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి కేప్‌టౌన్‌ను గెలిపించారు. అంతకుముందు రిజా హెండ్రిక్స్ (41) రాణించాడు. ఫలితంగా కేప్‌టౌన్ అతికష్టం మీద గట్టెక్కింది.


