మహిళల ప్రీమియర్ లీగ్-2026లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. సోమవారం వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. దీంతో హర్మన్ సేన తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా స్కివర్ రికార్డులెక్కింది.
57 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీలీ మాథ్యూస్(56) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయంకా పాటిల్, ఎన్‌డి క్లార్క్ తలా వికెట్ సాధించారు.
రిచా విధ్వంసం..
అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి రిచా ఘోష్ మాత్రం విధ్వంసం సృష్టించింది. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.
కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు సాధించారు.


