ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ బరిలోకి దిగిన ఆ జట్టు.. అనూహ్య పరాజయాలు (8 మ్యాచ్‌ల్లో 5) ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఎలిమినేషన్ అంచును ఆ జట్టును తాజాగా రషీద్ ఖాన్ వీడి వెళ్లాడు. జాతీయ విధులకు (వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం) హాజరయ్యేందుకు రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు.
కష్ట సమయాల్లో రషీద్ వెళ్లిపోవడం మినుకుమినుకుమంటున్న ఎం కేప్‌టౌన్ ప్లే ఆఫ్స్ బెర్త్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసింది. రషీద్ స్థానంలో యాజమాన్యం పొట్టి క్రికెట్ దిగ్గజం కీరన్ పోలార్డ్‌ను జట్టులో చేర్చుకుంది. పోలార్డ్ జట్టులో చేరినా ఎంఐ ఫేట్ మారే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టుకు మరో రెండు అవకాశాలు (మ్యాచ్‌లు) మాత్రమే ఉన్నాయి.
ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే.. ఎం కేప్‌టౌన్ ఫేట్ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమవుతుంది. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్, రస్సీ వాన్ డర్ డసెన్, జేసన్ స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు స్థిరంగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఫామ్‌లో లేడు. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడం, లేని పరుగులను సమర్పించుకోవడం లాంటి పొరపాట్లు చేస్తున్నారు.
తదుపరి మ్యాచ్‌ల్లో ఈ లోపాలను అధిగమించగలిగితే ఎంఐ కేప్‌టౌన్ విజయాల బాట పట్టవచ్చు. పోలార్డ్ తన పవర్ హిట్టింగ్, ఫీల్డింగ్, మీడియం పేస్ బౌలింగ్‌తో కేప్‌టౌన్‌లో ప్లే ఆఫ్స్ దిశగా నడిపించాలని ఆ ఫ్రాంచైజీ అభిమానులు కోరుకుంటున్నారు.
పోలార్డ్ 2024 ఎడిషన్‌లో రషీద్ ఖాన్ గాయపడినప్పుడు కేప్‌టౌన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ సీజన్‌లో అతను 188 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. పోలార్డ్ మరో 101 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతాడు.
కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మిగతా బెర్త్‌ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్‌టౌన్ పోటపడుతున్నాయి.


