క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా వదిలేశాడు.
విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్ తరఫున టీమ్, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకుంది. క్రికెట్ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్ టీ20 లీగ్-2025లో జరిగింది.
A RARE INCIDENT IN CRICKET 🤯
- Batter was struggling in the ILT20, so Nicholas Pooran decided not to get him out when he had the opportunity for a stumping. pic.twitter.com/x2Ikca0VnL— Johns. (@CricCrazyJohns) December 10, 2025
ఈ లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్ 9) డెజర్ట్ వైపర్స్-ఎంఐ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్ హోల్డన్ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్ నికోలస్ పూరన్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా హోల్డన్‌ను ఔట్ చేయలేదు. బంతిని కనెక్ట్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్ మరికొద్ది సేపు క్రీజ్‌లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్.
అయితే పూరన్ ప్లాన్‌ను పసిగట్టిన వైపర్స్ కెప్టెన్ ఫెర్గూసన్ హోల్డన్‌ను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో జరిగింది. అప్పటికి వైపర్స్ స్కోర్ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్ క్రీజ్‌ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్ స్కోర్ అంతిమంగా 159 పరుగులకు చేరింది.
ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్‌లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్‌లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్ డైరెక్ట్ త్రోతో ఘజన్‌ఫర్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


