ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్‌పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్‌లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్ బౌలర్ డేవిడ్ పేన్ 19వ ఓవర్‌లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు.
చివరి ఓవర్‌లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్‌ఫర్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.
19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ హోల్డన్ (42 రిటైర్డ్ ఔట్) టాప్ స్కోరర్ కాగా.. ఫకర్ జమాన్ (35) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్‌ఫర్ 2, ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ తీశారు.
ఎంఐ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (34) టాప్ స్కోరర్ కాగా.. పూరన్ (31), ముహమ్మద్ వసీం (24), పోలార్డ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్ బౌలర్లలో పేన్ 4, తన్వీర్ 2, ఫెర్గూసన్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.


