దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్న (డిసెంబర్ 4) గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐఎ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
కెప్టెన్ పోలార్డ్ (33 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో, నికోలస్ పూరన్ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించాడు.
మిగతా బ్యాటర్లలో ముహమ్మద్ వసీం 1, బెయిర్‌స్టో 11, బాంటన్ 6, తేజిందర్ దిల్లాన్ 15, రషీద్ ఖాన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. జెయింట్స్ బౌలర్లలో నువాన్ తుషార, అజ్మతుల్లా తలో 2, హైదర్ రజ్జాక్, మొయిన్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పథుమ్ నిస్సంక (42 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంకకు మొయిన్ అలీ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (39 నాటౌట్) సహకరించారు. ఎంఐ బౌలర్లలో వోక్స్‌కు 2, ఘజనఫర్‌కు ఓ వికెట్ దక్కింది.


