ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆటగాడిని ట్రేడ్ చేసిన మొదటి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. లక్నో తమ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసింది. ఇరు జట్ల మధ్య ఒప్పందం అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఐపీఎల్-2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. రెండు ఫ్రాంచైజీ మధ్య ట్రేడ్ డీల్ విజయవంతమైంది. గత సీజన్‌లో గాయపడిన ఆటగాడి స్ధానంలో శార్ధూల్‌ను రూ.2 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
ఇప్పుడు అదే మొత్తాన్ని ముంబై చెల్లించేందుకు సిద్దమైంది" అని ఐపీఎల్ మెనెజ్‌మెంట్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ డీల్ పూర్తిగా ఆల్ క్యాష్ డీల్ (All-Cash Deal) ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ డీల్‌కు ఒక్కరోజు ముందు శార్దూల్‌కు బదులుగా అర్జున్ టెండూల్కర్‌ను ఇచ్చిపుచ్చుకునేందుకు లక్నో, ముంబై ఇండియన్స్ సిద్దమయ్యాయి అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి రూమర్సే తాజా ప్రకటనతో రుజువయ్యాయి.
కాగా ఐపీఎల్-2025 వేలంలో ఠాకూర్‌ను ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే లక్నో పేసర్ మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్దానంలో శార్ధూల్‌కు ఆడే అవకాశం లభించింది.
రూ. 2 కోట్ల బెస్‌ప్రైస్‌కు లక్నో అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన శార్ధూల్.. 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక శార్ధూల్ ట్రేడ్ విషయాన్ని ముంబై ఇండియన్స్ కూడా ధ్రువీకరించింది. "డ్రీమ్స్ సిటీ అయిన ముంబైకి స్వాగతం అని ముంబై ఇండియన్స్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
కాగా ఠాకూర్ ముంబై నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. శార్ధూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. అతడు ఎక్కువ సీజన్ల పాటు సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే శార్ధూల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడనుండడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను నవంబర్ 15లోపు బీసీసీఐకి సమర్పించాలి.
చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే


