టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య మిథాలి పారుల్కర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. మొదటి సంతానంగా తమకు కుమారుడు జన్మించాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇన్నాళ్లు దాగున్న రహస్యం
ఈ మేరకు.. ‘‘తల్లిదండ్రుల హృదయాల్లో.. నిశ్శబ్దంతో ఇన్నాళ్లు దాగున్న ఓ రహస్యం ఎట్టకేలకు బయటపడింది. తొమ్మిది నెలల అందమైన కలల ప్రయాణం తర్వాత మా కుమారుడు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మా నమ్మకం, అంతులేని ప్రేమకు స్వాగతం పలుకుతున్నాం’’ అని శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా భార్య మిథాలి పారుల్కర్ (Mittali Parulkar) బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను శార్దూల్ ఠాకూర్ షేర్ చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన మిథాలి- శార్దూల్ దంపతులకు శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్, జహీర్ ఖాన్ సతీమణి సాగరిక ఘట్కే తదితరులు కంగ్రాట్స్ అంటూ విష్ చేశారు.
ఐపీఎల్‌లోనూ..
కాగా మహారాష్ట్రకు చెందిన టీమిండియా తరఫున ఇప్పటికి 13 టెస్టులు, 47 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ ఠాకూర్.. ఆయా ఫార్మాట్లలో 33, 65, 33 వికెట్లు కూల్చాడు.
ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 377 టెస్టు రన్స్, 329 వన్డే రన్స్, 69 టీ20 రన్స్ కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఇప్పటికి 105 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆల్‌రౌండర్.. 325 పరుగులు చేయడంతో పాటు.. 107 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌లో రీప్లేస్‌మెంట్‌గా చేరి సత్తా చాటిన శార్దూల్‌ను.. వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ శార్దూల్ ఠాకూర్‌ను ట్రేడ్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శార్దూల్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీతో బిజీ కానున్నాడు.
కాగా మిథాలిని ప్రేమించిన శార్దూల్ ఠాకూర్ 2021లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2023లో పెళ్లి పీటలు ఎక్కింది. శార్దూల్ క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. మిథాలి ప్రొఫెషనల్ బేకర్‌గా రాణిస్తోంది.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా


