భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని అత్యంతవేగంగా అందుకున్న మహిళా క్రికెటర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. ఆదివారం వైజాగ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది.
స్మృతి ఈ రికార్డును కేవలం 3227 బంతుల్లోనే అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ 3675 బంతుల్లో ఈ ఘనత సాధించింది. తాజా ఇన్నింగ్స్‌తో కివీ ఓపెనర్‌ను స్మృతి అధిగమించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో 29.90 సగటుతో 4007 పరుగులు చేసింది.
ఆమె అత్యధిక వ్యక్తిగా స్కోర్‌గా 112 పరుగులగా ఉంది. అయితే మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సుజీ బేట్స్(4716) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో మంధాన(4007), హర్మన్‌ప్రీత్ కౌర్(3657) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు శ్రీలంక బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు. అనంతరం 122 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమిమా కేవలం 44 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.
చదవండి: నితీశ్ రెడ్డి సారథ్యంలో...


