స్మృతి మంధాన (PC: BCCI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ముందుగానే ప్లే ఆఫ్స్ చేరిన స్మృతి మంధాన సేన జోరుకు ఆ తర్వాత బ్రేక్ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో తొలి ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలోనూ పరాజయం పాలైది.
రిచా ఘోష్ భేష్
ఈ నేపథ్యంలో ఓటమి స్పందిస్తూ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఆటను మేమంతా ఆస్వాదించాము. నదైన్ డిక్లెర్క్ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. నాట్ వరల్డ్‌క్లాస్ ప్లేయర్. ఒకచోట పడిన బంతిని మూడు వేర్వేరు విధాలుగా షాట్లు బాదగల సత్తా ఆమెకు ఉంది.
నాట్ మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేసింది. అద్భుతంగా ఆడి జట్టును గెలిపించుకుంది. అయితే, ఈ రోజు మా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. తొలి ఐదు మ్యాచ్‌లలో మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ రోజు మా వాళ్లు సరైన రీతిలో బౌలింగ్ చేయలేదు. టీ20 క్రికెట్‌లో ఇలాంటివి సహజమే.
మా బౌలర్లు విఫలమయ్యారు
కొన్నిసార్లు మన వ్యూహాలు బెడిసికొడతాయి. ఏదేమైనా లారెన్ బెల్ కొత్త బంతితో అద్బుతంగా ఆడింది. ఆ తర్వాత తిరిగి వచ్చి కూడా తన వంతు సహకారం అందించింది. కానీ మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా ఈరోజు సరిగ్గా ఆడలేదు. నదైన్ మాత్రం రెండు కష్టతరమైన ఓవర్లను అద్భుతంగా వేసింది’’ అని పేర్కొంది. ముంబై చేతిలో తమ ఓటమికి బౌలర్లే కారణమని స్మృతి మంధాన విశ్లేషించింది.
కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ నాట్ సివర్ బ్రంట్ (57 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు శతకం బాదింది. తద్వారా వడోదరలో సోమవారం జరిగిన పోరులో ముంబై 15 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది.
తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటైంది.
చదవండి: WPL 2026: చరిత్ర సృష్టించిన నాట్ సివర్ బ్రంట్.. తొలి ప్లేయర్‌గా


