‘హండ్రెడ్’ టోర్నీ బరిలో భారత మహిళా క్రికెటర్లు
లండన్: ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ (ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున) టోర్నమెంట్‌లో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు బరిలో ఉన్నారు. బుధవారం వేలం కార్యక్రమం నిర్వహించగా... భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టు 50,000 పౌండ్లకు (రూ. 61 లక్షలు); ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు 27,500 పౌండ్లకు (రూ. 34 లక్షలు) కొనుగోలు చేసింది.
వేలంలో కాకుండా గతంలోనే భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లను ఆయా ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకున్నాయి. స్మృతి మంధానను 90,000 పౌండ్లకు (రూ. 1 కోటీ 11 లక్షలు) మాంచెస్టర్ సూపర్ జెయింట్స్... జెమీమాను 60,000 పౌండ్లకు (రూ. 74 లక్షలు)సదరన్ బ్రేవ్ జట్టు అట్టిపెట్టుకున్నాయి. వేలంలో భారత్ నుంచి 14 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా... ఇద్దరిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.


