PC: WPL
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్‌లో యూపీ వారియర్స్ నామమాత్రపు స్కోరు సాధించింది. నవీ ముంబై వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా యూపీతో మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూపీకి ఆదిలోనే షాకులు తగిలాయి.
ఓపెనర్లలో హర్లిన్ డియోల్ (14 బంతుల్లో 11)ను స్వల్ప స్కోరుకే లారెన్ బెల్ పెవిలియన్‌కు పంపగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (14), వన్‌డౌన్ బ్యాటర్ ఫోబీ లిచిఫీల్డ్ (20)ల వికెట్లు శ్రేయాంక పాటిల్ తన ఖాతాలో వేసుకుంది.
రాణించిన దీప్తి, డియాండ్రా
ఇక కిరన్ నవగిరె (5)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (0)లను నదైన్ డిక్లెర్క్ అవుట్ చేసింది. దీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీ జట్టును ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, డియాండ్రా డాటిన్ ఆదుకున్నారు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా స్టార్ దీప్తి... 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది.
వెస్టిండీస్ వెటరన్ స్టార్ డియాండ్ర డాటిన్ సైతం 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేసింది. ఆఖరి వరకు దీప్తి, డాటిన్ ధనాధన్ దంచికొట్టడంతో యూపీ 140 పరుగుల మార్కు దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, డిక్లెర్క్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ ఒక వికెట్ దక్కించుకుంది. ఇక యూపీ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.
కాగా ఈ సీజన్‌లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. యూపీ తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఆర్సీబీ వర్సెస్ యూపీ తుదిజట్లు
ఆర్సీబీ
గ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నదైన్ డిక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
యూపీ
కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్.


