indian women cricketers
-
అరుంధతి రెడ్డి తొలిసారి...
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ (2024–25)ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లుగా విభజించి బోర్డు కాంట్రాక్ట్‌లు అందించింది. గత సీజన్లో ఈ జాబితాలో 17 మంది ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 16కు తగ్గింది. 2022 అక్టోబర్ తర్వాత భారత జట్టుకు ఆడని ఆంధ్ర ఓపెనింగ్ బ్యాటర్ సబ్బినేని మేఘన, 2023 జనవరి తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆంధ్ర లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అంజలి శర్వాణిలకు కొత్త కాంట్రాక్ట్ జాబితాలో స్థానం లభించలేదు. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి తొలిసారి ఈ అవకాశం దక్కింది. అరుంధతి భారత్ తరఫున 5 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఆరుగురు ప్లేయర్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఐదుగురిని కొత్తగా ఎంపిక చేశారు. అనూహ్యాలేమీ లేకుండా టాప్ ప్లేయర్లు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు ‘ఎ’ గ్రేడ్‌లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయినా... షఫాలీ వర్మ తన ‘బి’ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం. హెడ్ కోచ్ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ సిఫారసు ప్రకారం బోర్డు ఈ కాంట్రాక్ట్‌లను అందించింది. భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా గ్రేడ్ ‘ఎ’ (ఏడాదికి రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (ఏడాదికి రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ. గ్రేడ్ ‘సి’ (ఏడాదికి రూ. 10 లక్షలు): యస్తిక భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్. -
భారత మహిళా క్రికెట్ జట్టుకు షాక్.. భారీ జరిమానా
లండన్: భారత మహిళల జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జరిమానా విధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో స్లో ఓవర్ కారణంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయానికి అనుగుణంగా బౌలింగ్ చేయడంలో విఫలమైనందున మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1 సమమైంది. ఇక రెండో టీ20లో కీలకమైన బీమాంట్ వికెట్‌ను తీసిన భారత వుమెన్ క్రికెటర్ దీప్తి శర్మ (1/18)ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన భారత మహిళల జట్టు జరిమానా బారిన పడింది. -
భారత మహిళల అసమాన పోరాటం
బ్రిస్టల్: ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నారు. లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు), శిఖా పాండే (50 బంతుల్లో 18; 3 ఫోర్లు), తానియా భాటియా (88 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించారు. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న స్నేహ్, తానియా అజేయంగా తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 83/1తో మ్యాచ్ చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 121 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు చేసింది. టీ విరామానికి భారత్ 8 వికెట్లకు 243 పరుగులతో కష్టాల్లో ఉంది. అయితే చివరి సెషన్ అంతా స్నేహ్, తానియా వికెట్ చేజార్చుకోకుండా ఆడటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. అంతకుముందు షఫాలీ వర్మ (83 బంతుల్లో 63; 11 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (168 బంతుల్లో 54; 8 ఫోర్లు), పూనమ్ రౌత్ (104 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (8) మాత్రం మళ్లీ నిరాశపరిచారు. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈనెల 27న మొదలవుతుంది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 396/9 డిక్లేర్డ్; భారత్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 344/8 (121 ఓవర్లలో). -
మహిళా క్రికెటర్లకూ గ్రేడింగ్!
ముంబై : భారత మహిళా క్రికెటర్లకు కూడా గ్రేడింగ్ విధానంలో ఏడాదికి నిర్ణీత మొత్తం చెల్లించాలని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు ఫైనాన్స్ కమిటీ తాజాగా దీనిని ప్రతిపాదించింది. ఇది అమలైతే మిథాలీరాజ్, జులన్ గోస్వామివంటి సీనియర్ క్రికెటర్లకు ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. మరో వైపు బీసీసీఐ గత రెండేళ్లలో లీగల్ వ్యవహారాలు, కోర్టు కేసుల నిమిత్తం రూ. 56 కోట్లు ఖర్చు చేయడం విశేషం. స్పాట్ ఫిక్సింగ్‌ను విచారించిన ముద్గల్ కమిటీకి రూ. 1.5 కోట్లు, సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీకి బోర్డు రూ. 3.90 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర సంఘాలకు ఇస్తున్న మౌలిక సౌకర్యాల మొత్తాన్ని ఈ ఏడాది రూ. 75 కోట్లకు పెంచాలని భావించినా... భారీ మొత్తంలో లీగల్ ఖర్చులు ఉండటంతో దానిని రూ. 50 కోట్లకే సరిపెట్టాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.