భారత మహిళా క్రికెటర్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు
న్యూఢిల్లీ: దేశంలోని వేర్వేరు ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అమ్మాయిలంతా ఒకే లక్ష్యంతో పని చేసి దేశానికి ప్రపంచ కప్‌ను అందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. మహిళల వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా సభ్యులు గురువారం రాష్ట్రపతి భవన్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా అమ్మాయిల ఘనతలను రాష్ట్రపతి కొనియాడారు.
వ్యక్తిగతంగా ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి వారు సాధించిన విజయం అపూర్వమని ఆమె అన్నారు. ‘మన మహిళల క్రికెట్ జట్టు అసలైన భారత్‌కు ప్రతీక. భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు, వేర్వేరు పరిస్థితుల నుంచి వచ్చినవారు ఒక జట్టుగా ఆడి విజేతగా నిలిచారు. ఎన్నో త్యాగాలు చేసి మరీ వీరంతా ట్రోఫీని సాధించారు.
న్యూజిలాండ్‌పై గెలుపు తర్వాత మనవాళ్లు సాధించగలరనే నమ్మకం కలిగింది. ఇదే తరహాలో మున్ముందూ మన క్రికెట్‌ను వీరంతా మరింత ముందుకు తీసుకెళతారనే నమ్మకం ఉంది. ముఖ్యంగా కొత్త తరం అమ్మాయిలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు’ అని ముర్ము సందేశానిచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యుల సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బహుకరించింది.


