ముంబై: ‘హ్యాట్రిక్’ సాధించాలని ఆశించిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుకు చుక్కెదురైంది. టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్‌లో ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్ జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్ 2–0 (4–2; 4.5–1.5) పాయింట్ల తేడాతో తొలి రెండు ఎడిషన్స్‌లో టైటిల్ నెగ్గిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టును బోల్తా కొట్టించింది.
ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్ జట్టులో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, లియోన్ ల్యూక్ మెండోంకా, కరువానా (అమెరికా), హు ఇఫాన్ (చైనా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), నినో బతియాష్విలి (జార్జియా) సభ్యులుగా ఉన్నారు. తొలి ర్యాపిడ్ మ్యాచ్‌లో ఆల్పైన్ జట్టు 4–2తో త్రివేణి జట్టును ఓడించింది. రెండో ర్యాపిడ్ మ్యాచ్‌లో అల్పైన్ జట్టు 4.5–1.5తో త్రివేణి జట్టును మళ్లీ ఓడించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది.
కాంటినెంటల్ కింగ్స్ జట్టులో అలీరెజా (ఫ్రాన్స్), వె యి (చైనా), విదిత్ (భారత్), జు జినెర్ (చైనా), కొస్టెనిక్ (స్విట్జర్లాండ్), మౌరిజి (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. మూడో స్థానం మ్యాచ్‌లో పీబీజీ అలాస్కన్ నైట్స్ 3–1 (2–4; 3.5–2.5; 3.5–2.5; 4–2)తో గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టుపై నెగ్గింది. పీబీజీ అలాస్కన్ నైట్స్ జట్టులో గుకేశ్ దొమ్మరాజు, అర్జున్ ఇరిగేశి (భారత్), కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్), సారా ఖాదెమ్ (స్పెయిన్), లెనియర్ (అమెరికా), డేనియల్ దర్దా (బెల్జియం) సభ్యులుగా ఉన్నారు.


