
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): క్లిష్టంగా గడుస్తున్న ఈ సంవత్సరంలో తాజా ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తెలిపింది. తాను మరింత మెరుగయ్యేందుకు, రాణించేందుకు ఇది ఔషధంలా పనిచేస్తుందని చెప్పింది.
మహిళల ఎలైట్ ఈవెంట్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత వహించింది. 24 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్‌మాస్టర్ వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి సైతం అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి
‘గత విజయంతో పోల్చుకుంటే ఇది ముమ్మాటికి కఠినమైంది. 2023లో నేను ఫామ్‌లో ఉన్నాను. నిలకడగా విజయాలు సాధిస్తున్న సమయంలో గ్రాండ్ స్విస్ టైటిల్ గెలవడం ఏమంత కష్టం కాలేదు. కానీ ఇప్పుడు అంతా సులువుగా రాలేదు.
నేను ఎప్పట్లాగే కష్టపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో లభించిన టైటిల్ నన్ను మార్చింది. చాలా టోర్నీలలో ఆడటం ద్వారా గత రెండేళ్లుగా ఎంతో అనుభవాన్ని గడించా. అయితే గతేడాది క్యాండిడేట్స్ టోర్నీలో వరుసగా నాలుగు గేమ్‌లు ఓడిపోవడం, ఆ తర్వాత మింగుడుపడని ఫలితాలు నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి.
నేనొక ప్లేయర్‌గా మరింత బాగా ఆడేందుకు, ఓ వ్యక్తిగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేశాయి’ అని వైశాలి పేర్కొంది. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌లో తొమ్మిది రౌండ్ల పాటు వరుస వైఫల్యాలతో కేవలం 1.5 పాయింట్లే సాధించడం, మహిళల ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో తన్ జొంగ్‌జీ (చైనా) చేతిలో ఓడిపోవడం వైశాలిని కుంగుదీసింది.
తల్లి కళ్లల్లో ఆనందం
‘చెన్నై టోర్నీలో ఏకంగా ఏడు గేముల్లో ఓడాను. ఇంకా చెప్పాలంటే ఓ వారమంతా ఓటములతోనే గడిచిపోయింది. అప్పుడు ఏదోలా అనిపించింది. మంచో చెడో కూడా అర్థమయ్యేది కాదు. కానీ గెలిస్తే నన్ను ఎవరు ఆపలేరనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
అదే ఇప్పుడు జరిగింది’ అని వైశాలి వివరించింది. ఇక ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ గెలిచిన తర్వాత తల్లి నాగలక్ష్మి, తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి వైశాలి సంబరాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pride, love, and a mother’s touch ❤️
🇮🇳 Vaishali Rameshbabu, her mother Nagalakshmi, and her brother Praggnanandhaa R.#FIDEGrandSwiss @chessvaishali pic.twitter.com/NIYX5I3fs8— International Chess Federation (@FIDE_chess) September 16, 2025