సాక్షి, సిటీబ్యూరో: టెక్ మహీంద్రా, ‘ఫిడే’ సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్‌లో నేటి నుంచి ఈ లీగ్ జరుగుతుంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా సీజన్–3 విన్నర్స్ ట్రోఫీని ఆవిష్కరించారు.
త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్ మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ అధికారికంగా ఆదివారం ప్రారంభమవుతుంది. మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, అలీరెజా ఫిరూజా ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు
ఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తుందని చైర్‌పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. ఈ సీజన్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు ఆడనున్నారు. ప్రధాన ఆటగాళ్లలో అలీరెజా ఫిరూజా, ఫాబియానో కరువానా, హికారు నకముర, హు ఇఫాన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్ సహా భారత మేటి ఆటగాళ్లు పోటీపడతారు. క్లాసికల్ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ భారత చెస్ శక్తిని చాటుతున్నారు. రెండుసార్లు విజేతలైన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది.
10 రోజుల పాటు
మరోవైపు.. పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు యజమాని పునిత్ బాలన్, గుకేశ్ అర్జున్ వంటి ప్రతిభావంతులతో తాము బలమైన స్థితిలో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జేసీఎల్ మూడో సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో 10 రోజుల పాటు జరుగుతుంది.
ఇక ఈ లీగ్‌లో ప్రతి జట్టు 10 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 23న ఫైనల్ జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ఆరు బోర్డులపై పురుషులు, మహిళలు, యువ క్రీడాకారులు కలిసి పోటీపడతారు. భారత్‌లోని అభిమానులు జియో హాట్‌స్టార్ నెట్‌వర్క్‌లో లీగ్‌ను చూడవచ్చు. టిక్కెట్లు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.


