రెండో రౌండ్ తొలి గేమ్‌లో పెట్రోవ్ మార్టిన్‌పై గెలుపు
గుకేశ్, ప్రజ్ఞానంద, హరికృష్ణ గేమ్‌లు ‘డ్రా’
పనాజీ: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన భారత నంబర్‌వన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ ప్రపంచకప్ చెస్ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ ఆడుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ తొలి గేమ్‌లో గెలుపొందాడు. బల్గేరియా గ్రాండ్‌మాస్టర్ పెట్రోవ్ మారి్టన్‌తో మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ అర్జున్ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. పెట్రోవ్‌తో నేడు జరిగే రెండో గేమ్‌ను అర్జున్ ‘డ్రా’ చేసుకుంటే మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తాడు.
భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, దీప్తాయన్ ఘోష్, విదిత్ సంతోష్ గుజరాతి, కార్తీక్ వెంకటరామన్, అరవింద్ చిదంబరం, నిహాల్ సరీన్, ఇనియన్, కార్తికేయన్ మురళీ, ఎస్‌ఎల్ నారాయణన్, ప్రాణేశ్, రౌనక్ సాధ్వాని తమ ప్రత్యర్థులతో జరిగిన రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నారు.
భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ తన ప్రత్యర్థి టారీ ఆర్యన్ (నార్వే)పై 41 ఎత్తుల్లో గెలుపొందగా... సూర్యశేఖర గంగూలీ (భారత్) 37 ఎత్తుల్లో మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) చేతిలో, అరోణ్యక్ ఘోష్ (భారత్) 30 ఎత్తుల్లో లెవోన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.
గుకేశ్–నొగెర్‌బెక్ కాజీబెక్ (కజకిస్తాన్) గేమ్ 84 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–తెముర్ కుయ్‌బోకరోవ్ (ఆస్ట్రేలియా) గేమ్ 60 ఎత్తుల్లో... దీప్తాయన్ ఘోష్–నెపోమ్‌నిషి (రష్యా) గేమ్ 30 ఎత్తుల్లో... విదిత్–ఓరో ఫౌస్టినో (అర్జెంటీనా) గేమ్ 28 ఎత్తుల్లో... కార్తీక్ వెంకటరామన్–అరవింద్ గేమ్ 55 ఎత్తుల్లో... నిహాల్ సరీన్–స్టామాటిస్ (గ్రీస్) గేమ్ 90 ఎత్తుల్లో... పెంటేల హరికృష్ణ–అర్సెని నెస్తోరోవ్ (రష్యా) గేమ్ 30 ఎత్తుల్లో... ఇనియన్–నుగుయెన్ థాయ్ డాయ్ వాన్ (చెక్ రిపబ్లిక్) గేమ్ 45 ఎత్తుల్లో... కార్తికేయన్ మురళీ–ఇదానీ (ఇరాన్) గేమ్ 76 ఎత్తుల్లో... నారాయణన్–విటియుగోవ్ (ఇంగ్లండ్) గేమ్ 57 ఎత్తుల్లో... ప్రాణేశ్–దిమిత్రిజ్ కొలార్స్ (జర్మనీ) గేమ్ 34 ఎత్తుల్లో... రౌనక్–రాబర్ట్ హోవ్‌నాసియన్ (అర్మేనియా) గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.


