రెండో గేమ్ కూడా ‘డ్రా’
పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి క్వార్టర్ ఫైనల్ పోరు ‘టైబ్రేక్’కు చేరింది. అర్జున్, చైనా గ్రాండ్‌మాస్టర్ వె యి మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.
వీరి మధ్య సోమవారం జరిగిన తొలి గేమ్ కూడా సమంగా ముగిసింది. దాంతో ఫలితం తేల్చేందుకు బుధవారం ‘టైబ్రేక్’ నిర్వహిస్తారు. రెండో గేమ్‌లో తెల్ల పావులతో బరిలోకి దిగిన అర్జున్ పలు సందర్భాల్లో ఆధిక్యం ప్రదర్శించినా... దానిని చివరి వరకు నిలబెట్టుకోలేకపోయాడు.
ఈ టోర్నీలో మిగిలిన ఎనిమిది మంది ఆటగాళ్లలో అత్యుత్తమ ర్యాంకింగ్ ఉన్న అర్జున్ మిడిల్ గేమ్‌ను చూస్తే గెలుపు ఖాయమనిపించింది. కానీ కీలక దశలో ఒక ఎత్తును తప్పుగా వేయడంతో దీనిని వె యి సమర్థంగా వాడుకొని తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత ‘డ్రా’ తప్ప మరో ఫలితానికి అవకాశం లేకపోయింది. అయితే ర్యాపిడ్ ఫార్మాట్‌లో అర్జున్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.
మరో క్వార్టర్ ఫైనల్‌లో అలెగ్జాండర్ డొన్‌చెంకో (జర్మనీ)ను నాదిర్‌బెక్ యాకుబోవ్ (ఉజ్బెకిస్తాన్) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఆండ్రీ ఎసిపెంకో (రష్యా), స్యామ్ షాంక్‌లాండ్ (అమెరికా) మధ్య...జోస్ మార్టినెజ్ (మెక్సికో), జవోఖిర్ సిండ్రోవ్ (ఉజ్బెకిస్తాన్) మధ్య జరిగిన రెండో గేమ్‌లు కూడా ‘డ్రా’ ముగిశాయి. దాంతో ఈ రెండు మ్యాచ్‌లలో కూడా సెమీస్ చేరేదెవరో నేడు జరిగే ‘టైబ్రేక్’లోనే తేలనుంది.


