కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్, టాప్ సీడ్ తరుణ్ మన్నేపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ తరుణ్ 21–16, 12–21, 21–11తో భారత్‌కే చెందిన గోవింద్ కృష్ణపై గెలుపొందాడు.
భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, రిత్విక్
సంజీవి, శంకర్ ముత్తుస్వామి, రౌనక్ చౌహాన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో శంకర్ 21–8, 19–21, 21–15తో ఆర్య (భారత్)పై, కిరణ్ జార్జి 21–12, 21–18తో డెండి ట్రియాన్సి (ఇండోనేసియా)పై, రిత్విక్ 15–21, 21–6, 21–17తో సిద్ధాంత్ గుప్తా (భారత్)పై, రౌనక్ 21–18, 19–21, 21–17తో వరుణ్ కపూర్‌పై గెలుపొందారు.
శ్రియాన్షి పరాజయం
మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శ్రియాన్షి 18–21, 18–21తో తాన్యా హేమంత్ (భారత్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన ఉన్నతి హుడా, అనుపమ, తస్నిమ్ మీర్, తన్వీ శర్మ, అన్‌మోల్, ఇషారాణి బారువా కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
పురుషుల డబుల్స్ విభాగంలో అరిగెల భార్గవ్ రామ్–గొబ్బూరి విశ్వతేజ్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భార్గవ్ రామ్–విశ్వతేజ్ ద్వయం 18–21, 24–22, 21–17తో నితిన్–వీరంరెడ్డి వెంకట హర్షవర్ధన్ నాయుడు (భారత్) జంటపై గెలిచింది.


