మదురై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అండర్–21 ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు వరుసగా మూడో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 5–0తో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున మన్‌మీత్ సింగ్ (2వ, 11వ నిమిషాల్లో), శార్దానంద్ తివారి (13వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... అర్‡్షదీప్ సింగ్ (28వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు రాగా, రెండింటిని మాత్రమేసద్వినియోగం చేసుకుంది.
స్విట్జర్లాండ్ జట్టు ఐదు పెనాల్టీ కార్నర్‌లతోపాటు ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేసింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 29 గోల్స్ చేసిన భారత్ ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. భారత్‌తోపాటు జర్మనీ, అర్జెంటీనా, స్పెయిన్, నెదర్లాండ్స్, స్పెయిన్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి.


