మన్‌ప్రీత్‌సింగ్‌పై వేటు వేసిన హాకీ ఇండియా
న్యూఢిల్లీ: ప్రొ లీగ్ టోర్నీ కోసం గురువారం 33 మంది ప్రాబబుల్స్‌తో ప్రకటించిన భారత హాకీ జట్టులో స్టార్ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్‌కు చోటు దక్కకపోవడం చర్చకు దారి తీసింది. మన్‌ప్రీత్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దిల్‌ప్రీత్ సింగ్, కృషన్ బహదూర్ పాఠక్‌లను టీమ్ నుంచి తప్పించారు. అయితే వీరంతా తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల డిసెంబరులో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు వారు నిబంధనలు ఉల్లంఘించారని హెచ్‌ఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ టూర్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన భారత్ 2 ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ‘జట్టు సమావేశానికి ఒక ఆటగాడు గైర్హాజరు కావడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాం. అప్పుడు మరింత తీవ్రమైన అంశాలు బయటకు వచ్చాయి.
మన్‌ప్రీత్, దిల్‌ప్రీత్, కృషన్ కలిసి ఆ ఆటగాడికి నిషేధిత ఉత్ప్రేరకం కలిపిన చూయింగ్ గమ్‌ను ఇచ్చారు. దానిని వాడిన అతను స్పృహ కోల్పోయి టీమ్ మీటింగ్‌కు దూరమయ్యాడు. దాని ప్రభావం రాత్రంతా ఉండటంతో పాటు తర్వాతి ఉదయం కూడా సాధారణ స్థితికి రాలేకపోయాడు. విచారణ చేస్తే ఆ ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేలింది. వీరంతా ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా... వచ్చే టోర్నీ కోసం జరిగే శిబిరానికి వీరిని ఎంపిక చేయరాదనే నిర్ణయం అప్పుడే జరిగిపోయింది’ అని ఆయన వివరించారు.
అయితే దీనిపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ హాకీ ఇండియాకు ఎలాంటి రాత పూర్వక ఫిర్యాదు మాత్రం చేయలేదు. పైగా మన్‌ప్రీత్‌కు మద్దతు పలుకుతూ జట్టు నుంచి తప్పించరాదని కూడా ఫుల్టన్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఎన్నో కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న మన్‌ప్రీత్ అవసరం జట్టుకు ఉందని... అతడిని తొలగిస్తే తానూ రాజీనామా చేస్తానని కూడా కోచ్ హెచ్చరించినట్లు తెలిసింది. అయితే హాకీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్, చీఫ్ సెలక్టర్ ఆర్పీ సింగ్ చివరకు కోచ్‌ను ఒప్పించడంలో సఫలమయ్యారు.


