రూ. 18 కోట్లు.. ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు? | IPL 2026: Tickets Cancelled: Mystery Surrounding KKR Rs 18 Cr Star | Sakshi
Sakshi News home page

IPL 2026: రూ. 18 కోట్లు.. ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?

Mar 19 2026 6:44 PM | Updated on Mar 19 2026 6:59 PM

IPL 2026: Tickets Cancelled: Mystery Surrounding KKR Rs 18 Cr Star

కేకేఆర్‌ జట్టు (PC: KKR X)

ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను కేకేఆర్‌ జట్టు నుంచి తొలగించింది.

పతిరణకూ గాయం!
ఇక కేకేఆర్‌ మరో ఆటగాడు, టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. పేస్‌ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో రాణాతో పాటు రాణిస్తాడని భావించిన శ్రీలంక బౌలర్‌ మతీశ పతిరణ కూడా గాయపడ్డాడు.

ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?
టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా పతిరణ కాలికి గాయం కాగా.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే అతడు ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం. అయితే, శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు పతిరణకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పతిరణ ఫిట్‌నెస్‌ విషయంలో తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి కేకేఆర్‌ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (SLC) అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.

విమాన టికెట్లు బుకింగ్‌, రద్దు
మేము వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. దాదాపుగా ప్రతిరోజు పతిరణ కోసం విమాన టికెట్లు బుక్‌ చేయడం, రద్దు చేయడం జరుగుతోంది’’ అని పేర్కొన్నాయి. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పతిరణ.. దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందాడు.

చెన్నై వదిలేయగా.. రూ. 18 కోట్లకు కొనుగోలు
ఇప్పటి వరకు 32 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన 23 ఏళ్ల మతీశ పతిరణ.. 47 వికెట్లు తీశాడు. అయితే, 2026 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలివేయగా.. కేకేఆర్‌ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవైపు హర్షిత్‌ రాణా జట్టుకు దూరం కాగా.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్‌ కొనసాగడం కేకేఆర్‌కు తలనొప్పిగా మారింది.

మరోవైపు.. పతిరణ మేనేజర్‌ మాత్రం అతడు త్వరలోనే అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీని కేకేఆర్‌ జట్టులో చేర్చుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement