వాళ్ల ముందు మోకరిల్లారు: పీసీబీపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌ | Kneeling before: Pakistan Star Lambasts Naqvi PCB Recent Failures | Sakshi
Sakshi News home page

వాళ్ల ముందు మోకరిల్లారు: పీసీబీపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Mar 19 2026 4:21 PM | Updated on Mar 19 2026 5:06 PM

Kneeling before: Pakistan Star Lambasts Naqvi PCB Recent Failures

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రస్తుత యాజమాన్యం తీరుపై ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకరిల్లిందని.. అందుకే పాక్‌ క్రికెట్‌ నాశనమైపోయిందని మండిపడ్డాడు.

వరుస వైఫల్యాలు
కాగా గత కొంతకాలంగా పాకిస్తాన్‌ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో 2023 నుంచి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ కూడా చేరకుండా ఇంటిబాట పట్టిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లో కనీసం సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది.

తాజాగా 2026 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశ దాటినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. ఇక ఈ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టు.. వన్డే సిరీస్‌లో 2-1తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తద్వారా పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఈ మేరకు బంగ్లా చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఐదారు మందిపైనే ఫోకస్‌
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్‌ వెటరన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెబాజ్‌ పీసీబీ తీరును ఘాటుగా విమర్శించాడు. ‘‘మీ ఆటగాళ్ల స్థాయి మీరు ఊహించిన స్థాయిలో లేదు. పాకిస్తాన్‌ జట్టు, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) వేదికగా మీరు గత 5-7 ఏళ్ల నుంచి 6-8 మందినే ప్రధానంగా చూపిస్తూ హైలైట్‌ చేస్తున్నారు.

పీఎస్‌ఎల్‌, పాక్‌ జట్టు ముఖచిత్రంగా వారిని ప్రమోట్‌ చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం మీ రాత మార్చలేకపోతున్నారు. వాళ్లకు స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్ల రూపంలో డబ్బులే డబ్బులు. వాళ్లకు పీఎస్‌ఎల్‌లో కెప్టెన్సీలు కూడా మీరే ఇప్పిస్తారు. పాక్‌ క్రికెట్‌ అంటే వాళ్లే అనేంతలా ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

కనక వర్షం
కానీ వాళ్లు పాక్‌ క్రికెట్‌ వ్యవస్థలోని లోపాలు అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన ఎంజాయ్‌ చేస్తున్నారు. వాళ్ల జేబులు నిండుతున్నాయి. కానీ పాక్‌ జట్టు ఘోరమైన ఓటములు చవిచూస్తోంది. అయినా సరే అందులో ఒక్క ఆటగాడు కూడా బాధ్యత వహించేందుకు ముందుకు రాడు.

జట్టు ఓటమికి ఏవేవో కుంటిసాకులు చెబుతూ తప్పు తమది కాదని పక్క వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీబీ చరిత్రలో ఇంతటి బలహీనమైన యాజమాన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకర్లింది. మీరే దిక్కు అంటూ వారిని నెత్తినపెట్టుకుంది.

కొత్త వాళ్లను ప్రోత్సహించే బదులు పాత వాళ్లను అందలం ఎక్కించింది. వాళ్లేమో ప్రతీ టోర్నీలో ఓడటం.. దానికి ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది’’ అని పీసీబీ చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీని ఉద్దేశించి అహ్మద్‌ షెబాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

చదవండి: T20 WC 2026: జోస్ బ‌ట్ల‌ర్ రిటైర్మెంట్‌..?

Advertisement
 
Advertisement
Advertisement