3–1తో సూర్మ క్లబ్‌పై గెలుపు
పురుషుల హెచ్‌ఐఎల్
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ శ్రాచి బెంగాల్ టైగర్స్ పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బెంగాల్ 3–1తో సూర్మ హాకీ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రెండు క్వార్టర్లు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్ మొదలైన మూడు నిమిషాలకే బెంగాల్ టైగర్స్ స్ట్రయికర్ సుఖ్‌జీత్ సింగ్ (33వ ని.) గోల్‌తో ఖాతా తెరిచాడు.
ఈ క్వార్టర్ ముగిసే దశలో మళ్లీ అభిషేక్ (45వ ని.) గోల్ చేయడంతో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి క్వార్టర్‌లో ఎట్టకేలకు సూర్మ క్లబ్ తరఫున ప్రభ్‌జోత్ సింగ్ (54వ ని.) గోల్ కొట్టి 1–2తో బెంగాల్ ఆధిక్యానికి గండికొట్టినప్పటికీ ఆఖరి నిమిషంలో గుర్‌సేవక్ సింగ్ (60వ ని.) గోల్ చేయడంతో శ్రాచి బెంగాల్ టైగర్స్ 3–1తో విజయం సాధించింది. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 4–2తో రాంచీ రాయల్స్‌పై నెగ్గింది. అంతకు ముందు జరిగిన మహిళల హెచ్‌ఐఎల్‌లో శ్రాచి బెంగాల్ టైగర్స్ 1–0తో రాంచీ రాయల్స్‌పై నెగ్గింది. నేడు జరిగే అమ్మాయిల మ్యాచ్‌లో సూర్మ క్లబ్... రాంచీ రాయల్స్‌తో, పురుషుల ఈవెంట్‌లో ఎస్‌జీ పైపర్స్... హెచ్‌ఐఎల్ జీసీ జట్టుతో తలపడతాయి.


