
ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓటమి
సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడు సార్లు చాంపియన్ టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు... పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకొని పరాజయం వైపు నిలిచింది. భారత్ తరఫున అన్‌మోల్ ఎక్కా (17వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబెలార్ (13వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరిశాడు.
తొలి క్వార్టర్‌లో ఆ్రస్టేలియా గోల్ చేసి ఆధిక్యం సాధించగా... రెండో క్వార్టర్‌లో అన్‌మోల్ గోల్‌తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా... వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఆ్రస్టేలియా సద్వినియోగం చేసుకొని ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. గత మూడు ఫైనల్స్‌లో ఓడిన ఆ్రస్టేలియాకు ఇది నాలుగో ట్రోఫీ.
భారత జట్టుకు చివరి నిమిషంలో ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా... వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్‌గా మలచలేకపోయింది. ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాగ్నస్ మెక్‌కాస్లాండ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. గత రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... ఈసారి రజతం గెలుచుకుంది.