ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ తొలి రోజు ఇది జరిగింది. హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో స్టార్క్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. వసీం అక్రమ్ 104 టెస్ట్‌ల్లో 414 వికెట్లు తీయగా.. స్టార్క్ 102వ టెస్ట్‌లోనే ఈ ఘనత సాధించాడు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు (టాప్-5)
స్టార్క్-415*
వసీం అక్రమ్-414
చమింద వాస్-355
బౌల్ట్-317
జహీర్ ఖాన్-311
మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఇవాళే మొదలైన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్ బెన్ డకెట్, అదే స్కోర్ వద్ద (5) వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్‌ను డకౌట్ చేశాడు. అనంతరం కొద్ది గ్యాప్ ఇచ్చి హ్యారీ బ్రూక్‌ను (31) పెవిలియన్‌కు పంపాడు.
42 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 182/4గా ఉంది. డకెట్, పోప్, క్రాలే, బ్రూక్ ఔట్ కాగా.. జో రూట్ (65), కెప్టెన్ బెన్ స్టోక్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్ 3 వికెట్లు తీయగా.. మైఖేల్ నెసర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
స్టార్క్ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆతర్వాత కుదురుకుంది. రూట్, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. క్రాలే 76 పరుగుల వద్ద ఉండగా నెసర్ అద్బుతమైన బంతితో క్రాలే వికెట్ తీశాడు. అనంతరం రూట్‌తో జత కలిసిన బ్రూక్ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు.
ఈ దశలో మరోసారి బంతినందుకున్న స్టార్క్ బ్రూక్‌ను బోల్తా కొట్టించి, ఇంగ్లండ్‌ను మరోసారి కష్టాల్లోకి నెట్టేశాడు. రూట్, స్టోక్స్ ఇంగ్లండ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.


