రాయ్‌పూర్ వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్, కోహ్లి సెంచరీల సాయంతో టీమిండియా భారీ స్కోర్ (358) చేసినా, మంచు ప్రభావం కారణంగా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.
సఫారీలు బౌలింగ్‌లో విఫలమైనా, బ్యాటింగ్‌లో అదరగొట్టి రికార్డు లక్ష్యాన్ని ఛేదించారు (4 బంతులు మిగిలుండగానే). మార్క్రమ్ సూపర్ సెంచరీతో.. బ్రెవిస్ మెరుపు విన్యాసాలతో.. బవుమా, బ్రీట్జ్కే, కార్బిన్ బాష్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో సౌతాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) హర్షం వ్యక్తం చేశాడు. నమ్మశక్యంకాని మ్యాచ్‌గా అభివర్ణించాడు. రికార్డు ఛేదన అంటూ సహచరులను కొనియాడాడు. మార్క్రమ్, బ్రీట్జ్కే, బ్రెవిస్, బాష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా బ్రెవిస్‌ను ఆకాశానికెత్తాడు.
బ్రెవిస్‌ను బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు పంపిన వ్యూహం పని చేసిందని చెప్పుకొచ్చాడు. కీలకమైన భాగస్వామ్యాలు గెలుపుకు కారణమయ్యాయని అభిప్రాయపడ్డాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటను చివరి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు.
ఎంతటి భారీ లక్ష్యమైనా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై నమ్మకముంచితే గెలుపు సాధ్యమని అభిప్రాయపడ్డాడు. కార్బిన్ బాష్ చివర్లో పరిపక్వత చూపాడని ప్రశంసించాడు. బౌలింగ్ ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. బర్గర్, జోర్జి గాయాల అప్‌డేట్ ఏంటనే అంశంపై స్పందిస్తూ.. తానేమీ డాక్టర్‌ను కానని వ్యంగ్యంగా అన్నాడు.
మొత్తంగా ఈ విజయం జట్టుకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో సిరీస్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చామని అన్నాడు.
కాగా, గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన బవుమా ఈ మ్యాచ్‌తోనే తిరిగి బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన జట్టును గెలిపించాడు. ఇటీవలికాలంలో బవుమా విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు. అతనాడిన ప్రతి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా గెలుస్తుంది. టెస్ట్‌ల్లో అయితే అతనికి తిరుగేలేదు. వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉన్నా జట్టును మాత్రం విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు.


