నేటి నుంచి ‘యాషెస్’ రెండో టెస్టు
ఉదయం గం. 9:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి బ్రిస్బేన్‌లోని ‘గాబా’ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో గెలిచిన ఆ్రస్టేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. అదే జోరు కొనసాగిస్తూ ‘డే అండ్ నైట్’ టెస్టులోనూ విజయం సాధించాలని స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భావిస్తోంది.
మరోవైపు 2010–11 నుంచి ఆసీస్ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఇంగ్లండ్ జట్టు ‘ఫ్లడ్ లైట్’ల వెలుతురులో జరగనున్న పోరులో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ‘పింక్ బాల్’ టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఆసీస్... ఇప్పటి వరకు ఆడిన 14 ‘గులాబీ’ టెస్టుల్లో 13 గెలిచి, ఒక్కటి మాత్రమే ఓడింది. ఫ్లడ్ లైట్‌ల వెలుతురులో అతిగా స్వింగ్ అయ్యే ఆసీస్ పేసర్ల బంతులను ఎదుర్కోవడం ఇంగ్లండ్ ఆటగాళ్లకు శక్తికి మించిన పనే.
గాయం కారణంగా జట్టుకు దూరమైన ఉస్మాన్ ఖ్వాజా స్థానంలో జోష్ ఇన్‌గ్లిస్‌కు ఆ్రస్టేలియా తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. గత మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన ట్రావిస్ హెడ్ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... లబుషేన్, స్మిత్, గ్రీన్, కేరీ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్టార్క్‌కు బొలాండ్, డగెట్ నుంచి చక్కటి సహకారం లభిస్తోంది.
మరోవైపు ‘బాజ్‌బాల్’నే నమ్ముకున్న ఇంగ్లండ్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా... వీరంతా సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆర్చర్, అట్కిన్సన్, కార్స్ కీలకం కానున్నారు.


