‘నాకు పెళ్లైందోచ్‌..’ 62 ఏళ్ల ఆస్ట్రేలియా ప్రధాని | Who Is Jodie Haydon Marries Australia PM Anthony Albanese At Age 62, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘నాకు పెళ్లైందోచ్‌..’ 62 ఏళ్ల ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌

Nov 29 2025 3:23 PM | Updated on Nov 29 2025 5:05 PM

Who is Jodie Haydon Marries Australia PM Anthony Albanese Details

62 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధాని మళ్లీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ‘నాకు పెళ్లైందోచ్‌..’ అంటూ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఆరేళ్లుగా పబ్లిక్‌గా ఈ జంట డేటింగ్‌లో ఉండగా.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కావడం విశేషం. 

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన గర్ల్‌ఫ్రెండ్‌ జోడీ హైడెన్‌ (Jodie Haydon)ను ఆయన పెళ్లాడారు. కాన్‌బెర్రాలోని ఆంథోనీ (Anthony Albanese) అధికారిక నివాసం ది లాడ్జ్‌ తోటలో కొద్దిమంది మధ్య ఈ వేడుకలు జరిగాయి. తన పార్ట్‌నర్‌ చేతిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఆంథోనీ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

జోడీ హైడెన్‌(47) అడ్వొకేట్‌తో పాటు ఆర్థిక నిపుణురాలు కూడా.  2019లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ బిజినెస్‌ డిన్నర్‌లో ఆంథోనీ అల్బనీస్‌ను తొలిసారి ఈమె కలుసుకున్నారు. దాదాపు అదే సమయంలో అల్బనీస్‌ తన భార్య(మొదటి) కార్మెల్‌ నుంచి విడిపోయారు.  ఆ తర్వాత నుంచి ఆల్బనీస్‌-హైడెన్‌లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 

2022లో ఫెడరల్‌ ఎన్నికల ప్రచారంలో అల్బనీస్‌ వెంట జోడీ హైడెన్‌ సందడి చేశారు. ప్రధాని పదవి చేపట్టాక అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు. దుబాయ్‌, మాడ్రిడ్‌, స్పెయిన్‌, పారిస్‌ పర్యటనల్లో పాల్గొన్న ఆమె.. క్వీన్‌​ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు, 2023లో నాటి అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన విందుకూ ఆల్బనీస్‌ వెంట ఆమె కనిపించారు. ఈ క్రమంలో వారి ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేశాయి. 

కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రధాని హోదాలో ఓ వ్యక్తి వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో యూకే ప్రధానిగా ఉన్న బోరిస్‌ జాన్సన్‌ 2021లో క్యారీ సైమండ్స్‌ను వివాహం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement