రెండో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 ఆలౌట్
408 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
2–0తో సిరీస్ హస్తగతం
మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు అదే మాకు రెండో టెస్టులో విజయంతో సమానం... నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్య ఇది. ‘డ్రా’ చేసుకోవడం కాదు కదా... మన ఆటగాళ్లు కనీస స్థాయి పోరాటం కూడా చేయలేకపోయారు... చివరి రోజు సఫారీ స్పిన్నర్లు పదునైన బంతులతో మన పని పట్టి అలవోకగా మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టారు.
రికార్డు విజయంతో సిరీస్‌ను గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌గా తమ స్థాయిని ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా సింహనాదం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను శాసించిన యాన్సెన్ చివరి క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడం సరైన ముగింపు కాగా... ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండు సిరీస్‌లలో వైట్‌వాష్ కు గురైన భారత బృందం అవమాన భారాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. అనూహ్యమేమీ జరగకుండా భారత్ సులువుగా తలవంచింది. ఊహించిన విధంగానే రెండు సెషన్ల లోపే మ్యాచ్ చేజారింది. టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లకు 48 ఓవర్లు సరిపోయాయి. బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 27/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.
రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడం మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/37) ఆరు వికెట్లతో భారత్ పని పట్టాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టును కూడా గెలిచిన దక్షిణాఫ్రికా తాజా ఫలితంతో 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
25 ఏళ్ల తర్వాత ఆ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం విశేషం. 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసిన మార్కో యాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... మొత్తం 17 వికెట్లు తీసిన సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది.
జడేజా మినహా...
ఓటమి నుంచి తప్పించుకునేందుకు చివరి రోజు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో కాస్త అదృష్టం కలిసొచ్చింది. యాన్సెన్ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద సాయి సుదర్శన్ క్యాచ్ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 4 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ (5) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మార్క్‌రమ్ వదిలేశాడు. అయితే ఇది ఎంతోసేపు సాగలేదు. ఒకే ఓవర్లో కుల్దీప్, జురేల్ (2)లను అవుట్ చేసి దెబ్బ కొట్టిన హార్మర్... కొద్ది సేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (13)ను కూడా వెనక్కి పంపాడు.
టీ విరామానికి భారత్ స్కోరు 90/5కు చేరింది. అయితే ప్రతీ బంతిని డిఫెన్స్ ఆడుతూ పట్టుదల ప్రదర్శించిన సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14; 1 ఫోర్)) ఎట్టకేలకు ముత్తుసామి వేసిన ఒక చక్కటి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా, సుందర్ (16) కొద్దిసేపు పోరాడారు. అయితే కొత్త స్పెల్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన హార్మర్ 8 పరుగుల వ్యవధిలో సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేయగా... మహరాజ్ ఒకే ఓవర్లో జడేజా, సిరాజ్ (0)లను వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో వేడుకలు మొదలయ్యాయి.
ఐదో స్థానానికి భారత్..
భారీ ఓటమి తర్వాత ఇప్పటికిప్పుడు భారత టెస్టు జట్టు ప్రదర్శనపై ఎలాంటి చర్చా జరిగే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డేలు, టి20ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ స్వదేశంలోనే వన్డే, టి20 సిరీస్‌లు ఆడనుంది. ఆపై టి20 వరల్డ్ కప్, ఐపీఎల్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పరాజయంపై విశ్లేషణలు, ప్రశ్నలు ఇక్కడితోనే ముగిసిపోవచ్చు! మరోవైపు తాజా ఓటమితో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది.
అయితే ఈ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. భారత తమ తర్వాతి టెస్టు మ్యాచ్ 2026 ఆగస్టులోనే ఆడనుంది. శ్రీలంకకు వెళ్లి 2 టెస్టులు, ఆపై న్యూజిలాండ్‌లో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఉన్న ఈ 9 టెస్టుల్లో ప్రదర్శన మన ఫైనల్ ప్రస్థానాన్ని నిర్దేశించనుంది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (సి) మార్క్‌రమ్ (బి) ముత్తుసామి 14; కుల్దీప్ (బి) హార్మర్ 5; జురేల్ (సి) మార్క్‌రమ్ (బి) హార్మర్ 2; పంత్ (సి) మార్క్‌రమ్ (బి) హార్మర్ 13; జడేజా (స్టంప్డ్) వెరీన్ (బి) మహరాజ్ 54; సుందర్ (సి) మార్క్‌రమ్ (బి) హార్మర్ 16; నితీశ్ రెడ్డి (సి) వెరీన్ (బి) హార్మర్ 0; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) యాన్సెన్ (బి) మహరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్) 140.
వికెట్ల పతనం: 1–17, 2–21, 3–40, 4–42, 5–58, 6–95, 7–130, 8–138, 9–140, 10–140. బౌలింగ్: యాన్సెన్ 15–7–23–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 23–6–37–6, మహరాజ్ 12.5–1–37–2, మార్క్‌రమ్ 2–0–2–0, ముత్తుసామి 7–1–21–1.
408 టెస్టుల్లో పరుగులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. 2004లో ఆ్రస్టేలియా చేతిలో (నాగ్‌పూర్‌లో) భారత్ 342 పరుగుల తేడాతో ఓడింది.
3
స్వదేశంలో భారత్ వైట్‌వాష్ కు గురి కావడం ఇది మూడోసారి. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, 2024లో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడింది.
9 ఈ మ్యాచ్‌లో మార్క్‌రమ్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రహానే (8) రికార్డును అతను సవరించాడు.
11 కెప్టెన్‌గా బవుమాకిది 11వ టెస్టు విజయం. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి డ్రా కాగా, అతని నాయకత్వంలో జట్టు ఒక్క టెస్టూ ఓడలేదు.
టెస్టు జట్టుకు కోచ్‌గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం నా చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్‌లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.
కివీస్‌తో సిరీస్‌తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది. ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్‌లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి. –గౌతమ్ గంభీర్, భారత హెడ్ కోచ్
చాలా గొప్ప విజయం. అసాధారణ ఘనత ఇది. భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం సాధారణంగా ఊహకు కూడా అందనిది. మా ఆటపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ సమాధానమిది. మంచి సన్నద్ధతతో పాటు పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకున్నాం. తమ బాధ్యతపై ప్రతీ ఒక్కరికి స్పష్టత ఉండటం మేలు చేసింది. –తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్


