మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించనుండగా.. రోహిత్ 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని తాకుతాడు.
రో-కో ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇదే మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు బద్దలవడం ఖాయంగా తెలుస్తుంది. రోహిత్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, మూడు అర్ద సెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింపై భారీ శతకంతో (155) అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
కోహ్లి విషయానికొస్తే.. రోహిత్‌తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 4 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసి మరో భారీ ఇన్నింగ్స్ కోసం గర్జిస్తున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతుంది. 16 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (42), డెవాన్ కాన్వే (35) భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు. నికోల్స్‌కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది. కుల్దీప్ యాదవ్ సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది.
తుది జట్లు..
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ


