breaking news
Simon Harmer
-
భారత్‌పై అదరగొట్టాడు.. ఐసీసీ అవార్డు రేసులోకి వచ్చాడు
సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శన కారణంగానే అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.అతడితో పాటు ఈ జాబితాలో బంగ్లా దేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత నుంచి మెన్స్ క్రికెటర్ ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం.దుమ్ములేపిన హార్మర్..సైమన్ హార్మర్ ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.హార్మర్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టి భారత్ గడ్డపై దక్షిణాఫ్రికా చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పాక్‌తో సిరీస్‌లో కూడా హార్మర్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ నామినేట్ అయ్యింది. గత నెలలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లలో షెఫాలీ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ ఫైనల్లో పోరులో బ్యాటింగ్‌లో 87 పరుగులు చేసిన షెఫాలీ.. అనంతరం బౌలింగ్‌లో సునే లూస్, మరిజానే కాప్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు ఈ లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.చదవండి: ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా? -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సత్తా చాటింది. స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ చేసింది. ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్లో విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ తాజా సీజన్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్ చేశారు.408 పరుగుల భారీ తేడాతోరెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో భారత్‌పై గెలిచిన సౌతాఫ్రికా.. గువాహటిలో చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన బర్సపరా స్టేడియంలో ఆద్యంత ఆధిపత్యం కనబరిచి.. టీమిండియా (IND vs SA 2nd Test)ను ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.తొలి జట్టుగా చరిత్ర తద్వారా ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్‌పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. గతంలో ఆస్ట్రేలియా నాగ్‌పూర్ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో గెలవగా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది.కాగా టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లది కీలక పాత్ర. పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) రెండో టెస్టులో సత్తా చాటి ప్లేయర్‌గా నిలవగా.. సఫారీ పేసర్ సైమన్ హార్మర్ రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఘోర పరాజయాలు (పరుగుల పరంగా)🏏సౌతాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి- 2025, గువాహటి🏏ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి- 2008, నాగ్‌పూర్🏏పాకిస్తాన్ చేతిలో 341 పరుగుల తేడాతో ఓటమి- 2006, కరాచి🏏ఆస్ట్రేలియా చేతిలో 337 పరుగుల తేడాతో ఓటమి- 2007, మెల్బోర్న్🏏ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి- 2017, పూణె.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బర్సపరా స్టేడియం, గువాహటి👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్👉సౌతాఫ్రికా స్కోర్లు: 489 &260/5 డిక్లేర్డ్👉భారత్ స్కోర్లు: 201 &140👉ఫలితం: 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు.. సిరీస్ 2-0తో వైట్‌వాష్.చదవండి: సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే.. -
రెండో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్
మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు అదే మాకు రెండో టెస్టులో విజయంతో సమానం... నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్య ఇది. ‘డ్రా’ చేసుకోవడం కాదు కదా... మన ఆటగాళ్లు కనీస స్థాయి పోరాటం కూడా చేయలేకపోయారు... చివరి రోజు సఫారీ స్పిన్నర్లు పదునైన బంతులతో మన పని పట్టి అలవోకగా మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టారు. రికార్డు విజయంతో సిరీస్‌ను గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌గా తమ స్థాయిని ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా సింహనాదం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను శాసించిన యాన్సెన్ చివరి క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడం సరైన ముగింపు కాగా... ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండు సిరీస్‌లలో వైట్‌వాష్ కు గురైన భారత బృందం అవమాన భారాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. అనూహ్యమేమీ జరగకుండా భారత్ సులువుగా తలవంచింది. ఊహించిన విధంగానే రెండు సెషన్ల లోపే మ్యాచ్ చేజారింది. టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లకు 48 ఓవర్లు సరిపోయాయి. బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 27/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడం మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/37) ఆరు వికెట్లతో భారత్ పని పట్టాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టును కూడా గెలిచిన దక్షిణాఫ్రికా తాజా ఫలితంతో 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 25 ఏళ్ల తర్వాత ఆ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం విశేషం. 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసిన మార్కో యాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... మొత్తం 17 వికెట్లు తీసిన సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. జడేజా మినహా... ఓటమి నుంచి తప్పించుకునేందుకు చివరి రోజు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో కాస్త అదృష్టం కలిసొచ్చింది. యాన్సెన్ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద సాయి సుదర్శన్ క్యాచ్ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 4 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ (5) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మార్క్రమ్ వదిలేశాడు. అయితే ఇది ఎంతోసేపు సాగలేదు. ఒకే ఓవర్లో కుల్దీప్, జురేల్ (2)లను అవుట్ చేసి దెబ్బ కొట్టిన హార్మర్... కొద్ది సేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (13)ను కూడా వెనక్కి పంపాడు. టీ విరామానికి భారత్ స్కోరు 90/5కు చేరింది. అయితే ప్రతీ బంతిని డిఫెన్స్ ఆడుతూ పట్టుదల ప్రదర్శించిన సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14; 1 ఫోర్)) ఎట్టకేలకు ముత్తుసామి వేసిన ఒక చక్కటి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా, సుందర్ (16) కొద్దిసేపు పోరాడారు. అయితే కొత్త స్పెల్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన హార్మర్ 8 పరుగుల వ్యవధిలో సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేయగా... మహరాజ్ ఒకే ఓవర్లో జడేజా, సిరాజ్ (0)లను వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో వేడుకలు మొదలయ్యాయి. ఐదో స్థానానికి భారత్.. భారీ ఓటమి తర్వాత ఇప్పటికిప్పుడు భారత టెస్టు జట్టు ప్రదర్శనపై ఎలాంటి చర్చా జరిగే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డేలు, టి20ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ స్వదేశంలోనే వన్డే, టి20 సిరీస్‌లు ఆడనుంది. ఆపై టి20 వరల్డ్ కప్, ఐపీఎల్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పరాజయంపై విశ్లేషణలు, ప్రశ్నలు ఇక్కడితోనే ముగిసిపోవచ్చు! మరోవైపు తాజా ఓటమితో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. భారత తమ తర్వాతి టెస్టు మ్యాచ్ 2026 ఆగస్టులోనే ఆడనుంది. శ్రీలంకకు వెళ్లి 2 టెస్టులు, ఆపై న్యూజిలాండ్‌లో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఉన్న ఈ 9 టెస్టుల్లో ప్రదర్శన మన ఫైనల్ ప్రస్థానాన్ని నిర్దేశించనుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) ముత్తుసామి 14; కుల్దీప్ (బి) హార్మర్ 5; జురేల్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 2; పంత్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 13; జడేజా (స్టంప్డ్) వెరీన్ (బి) మహరాజ్ 54; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 16; నితీశ్ రెడ్డి (సి) వెరీన్ (బి) హార్మర్ 0; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) యాన్సెన్ (బి) మహరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–40, 4–42, 5–58, 6–95, 7–130, 8–138, 9–140, 10–140. బౌలింగ్: యాన్సెన్ 15–7–23–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 23–6–37–6, మహరాజ్ 12.5–1–37–2, మార్క్రమ్ 2–0–2–0, ముత్తుసామి 7–1–21–1. 408 టెస్టుల్లో పరుగులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. 2004లో ఆ్రస్టేలియా చేతిలో (నాగ్‌పూర్‌లో) భారత్ 342 పరుగుల తేడాతో ఓడింది.3స్వదేశంలో భారత్ వైట్‌వాష్ కు గురి కావడం ఇది మూడోసారి. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, 2024లో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడింది.9 ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రహానే (8) రికార్డును అతను సవరించాడు. 11 కెప్టెన్‌గా బవుమాకిది 11వ టెస్టు విజయం. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి డ్రా కాగా, అతని నాయకత్వంలో జట్టు ఒక్క టెస్టూ ఓడలేదు. చాలా గొప్ప విజయం. అసాధారణ ఘనత ఇది. భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం సాధారణంగా ఊహకు కూడా అందనిది. మా ఆటపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ సమాధానమిది. మంచి సన్నద్ధతతో పాటు పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకున్నాం. తమ బాధ్యతపై ప్రతీ ఒక్కరికి స్పష్టత ఉండటం మేలు చేసింది. –తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.కాస్త నిరాశకు లోనయ్యాంఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.భారీ మూల్యమే చెల్లించాముఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. క్రికెట్లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్ పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. కోల్‌కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇరవై ఐదేళ్ల తర్వాతఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్‌వాష్ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయం వల్ల దూరం కాగా.. పంత్ పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్ బౌలర్లు అడియాసలు చేశారు.ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్ హార్మర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్ రెండు, సెనూరన్ ముత్తుస్వామి ఒక వికెట్ తీశారు. పేసర్ మార్కో యాన్సెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యాన్సెన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి భారత్‌ను 201 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. హార్మర్ (మొత్తంగా 17 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.చదవండి: Sai Sudharsan: సూపర్ స్లో బ్యాటింగ్! -
టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!
ఊహించిందే జరిగింది.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA) 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కనీస పోరాట పటిమ కూడా కనబరచకుండా ‘స్టార్’ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడం భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) -2025 విజేత సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది.ఆది నుంచే ఆధిపత్యంఅనంతరం భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.549 పరుగుల లక్ష్యంఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్ వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నెమ్మదిగా ఆడుతూనే 78.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్ జట్టు తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. టీమిండియాకు 549 పరుగుల (288+260) భారీ లక్ష్యాన్ని విధించింది.రెండో ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. టోనీ డి జోర్జీ (49) తృటిలో అర్ధ శతంక చేజార్చుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (13)ను యాన్సెన్ వెనక్కి పంపగా.. కేఎల్ రాహుల్ (6)ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.హార్మర్ విజృంభణఈ క్రమంలో 27/2 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ చుక్కలు చూపించాడు. నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ (5)ను సైమన్ బౌల్డ్ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14)ను సెనూరన్ ముత్తుస్వామి వెనక్కి పంపాడు.ఆ తర్వాత సైమన్ హార్మర్ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్ జురెల్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. లాంఛనం పూర్తి చేసిన మహరాజ్ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్ కేశవ్ మహరాజ్.. మొహమ్మద్ సిరాజ్ (0) ఆఖరి వికెట్‌గా వెనక్కి పంపి టీమిండియా ఓటమిని ఖరారు చేశాడు. మొత్తంగా సైమన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ రెండు, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ యాన్సెన్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక సమిష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడమే కాదు..వైట్‌వాష్ చేసింది కూడా!! భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 489 & 260/5 డిక్లేర్డ్భారత్: 201 & 140ఫలితం: 408 పరుగుల తేడాతో భారత్‌పై సౌతాఫ్రికా గెలుపుచదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
టీమిండియాకు ఒకటైతే.. సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..!
కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మెడ గాయం కారణంగా కెప్టెన్ గిల్ (Shubman Gill) సేవలను ఉన్నపళంగా కోల్పోయిన భారత జట్టు.. మ్యాచ్‌ను కూడా అత్యంత అవమానకర రీతిలో చేజార్చుకుంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని టీమిండియా బొక్కబోర్లా పడి, ఘోర అపవాదును మూటగట్టుకుంది.తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన గిల్.. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తొలి టెస్ట్‌లో గిల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అతని అవసరం అనివార్యమైనా తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. మైదానం నుంచి గిల్‌ను నేరుగా వుడ్లాండ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్సనందించారు.సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..!ఇదే ఆసుపత్రిలో సౌతాఫ్రికాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కూడా మ్యాచ్ అనంతరం చికిత్సనందించారని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించడంలో కీలక పాత్రధారులైన సైమన్ హార్మర్ (Simon Harmer), మార్కో జన్సెన్ (Marco Jansen) గాయాలతో బాధపడుతూ గిల్ చికిత్స పొందిన వుడ్లాండ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందారని సమాచారం. హార్మర్ భుజం గాయం, జన్సెన్ మరో గాయంతో బాధపడుతూ సదరు ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తుంది. ఈ గాయాల తాలుకా అధికారిక సమాచారమైతే ఇప్పటివరకు లేదు. ఒకవేళ నిజంగా హార్మర్, జన్సెన్ గాయాల బారిన పడి ఉంటే, సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు తగిలినట్లే.కోల్‌కతా టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసిన హార్మర్ భారత్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా అతినికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జన్సెన్ కూడా తొలి టెస్ట్‌లో సత్తా చాటాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు తీసి టీమిండియా పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒకవేళ ఈ ఇద్దరు రెండో టెస్ట్‌కు దూరమైతే, సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బలు తగిలనట్లవుతుంది.వీరికి ప్రత్యామ్నాయాలుగా సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ ఉన్నా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు లేకపోవడం సౌతాఫ్రికాకు పెద్ద లోటే అవుతుంది. చదవండి: IPL 2026 Auction: 'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్కే -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు... పిచ్ ఎలాంటిదైనా కాస్త పట్టుదల కనబరిస్తే సునాయాసంగా ఛేదించగల స్కోరే... కానీ టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలింది...రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్‌కు, ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్ ముందు బ్యాటర్లు తలవంచారు. మనకు అనుకూలిస్తుందనుకున్న స్పిన్ పిచ్ సఫారీలకు అంది వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన తీరును గుర్తుకు చేస్తూ భారత్ స్వదేశంలో మరో పరాభవాన్ని మూటగట్టుకోగా, వరల్డ్ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు గెలిచి సంబరాలు చేసుకుంది. పదేళ్ల క్రితం అనామకుడిగా ఇక్కడ అడుగు పెట్టి భారత బ్యాటర్ల చేతిలో చావు దెబ్బ తిన్న ఆఫ్‌స్పిన్నర్ సైమన్ హార్మర్ దశాబ్దం తర్వాత ఒక అరుదైన విజయాన్ని రచించడం విశేషం. కోల్‌కతా: భారత టెస్టు జట్టుకు స్వదేశంలో అనూహ్య షాక్...ఈడెన్ గార్డెన్లో స్పిన్ పిచ్ కోరుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన జట్టు చివరకు ప్రత్యర్థి స్పిన్ దెబ్బకే తలవంచింది. ఆదివారం మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో సైమన్ హార్మర్ 4, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 93/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచ్‌లో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ముందంజ వేయగా, నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగుతుంది. రెండో రోజు మెడకు గాయం కావడంతో ఆట నుంచి తప్పుకొని ఆస్పత్రిలో చేరిన భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ ఆదివారం వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. కోలుకున్న గిల్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆదుకున్న బవుమా... ఆదివారం మైదానంలోకి వచ్చే సమయానికి భారత్ విజయంపై ధీమాగా ఉంది. మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోగా, పదునైన డిఫెన్స్‌తో పట్టుదలగా నిలిచిన బవుమా సింగిల్స్‌తో పరుగులు జోడిస్తూ పోయాడు. కొద్ది సేపు దూకుడుగా ఆడిన కార్బిన్ బాష్ (37 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), బవుమా కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. చివరకు బాష్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా...సిరాజ్ ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్ మినహా... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ (0)ను అవుట్ చేసిన యాన్సెన్, తన రెండో ఓవర్లో రాహుల్ (1)ను పెవిలియన్‌కు పంపి దెబ్బ కొట్టాడు. ఈ దశలో 32 పరుగులు జత చేసి సుందర్, జురేల్ (13) జట్టును ముందుకు నడిపించారు. అయితే జురేల్, పంత్ (2) చెత్త షాట్లతో వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలోనూ సుందర్, రవీంద్ర జడేజా (18) భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ సఫారీ స్పిన్నర్లు మళ్లీ పైచేయి సాధించారు. వీరిద్దరు 8 పరుగుల తేడాతో అవుట్ కాగా, కుల్దీప్ (1) వారిని అనుసరించాడు. గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సాహసం ప్రదర్శించాడు. మహరాజ్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాది 16 పరుగులు రాబట్టాడు. చివరకు మహరాజ్దే పైచేయి అయింది. ఐదో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అక్షర్ వెనుదిరగ్గా, తర్వాతి బంతికే సిరాజ్ (0) అవుట్ కావడంలో దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159; భారత్ తొలి ఇన్నింగ్స్ 189; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సుందర్ (సి) హార్మర్ (బి) మార్క్రమ్ 31; జురేల్ (సి) బాష్ (బి) హార్మర్ 13; పంత్ (సి) అండ్ (బి) హార్మర్ 2; జడేజా (ఎల్బీ) (బి) హార్మర్ 18; అక్షర్ (సి) బవుమా (బి) మహరాజ్ 26; కుల్దీప్ (ఎల్బీ) (బి) హార్మర్ 1; బుమ్రా (నాటౌట్) 0; సిరాజ్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (35 ఓవర్లలో ఆలౌట్) 93. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–33, 4–38, 5–64, 6–72, 7–77, 8–93, 9–93. బౌలింగ్: యాన్సెన్ 7–3–15–2, హార్మర్ 14–4–21–4, మహరాజ్ 9–1–37–2, బాష్ 2–0–14–0, మార్క్రమ్ 3–0–5–1. బ్యాటింగ్ చేయలేనంత ఇబ్బందికరంగా పిచ్ ఏమీ లేదు. మేం సరిగ్గా ఇలాంటి పిచ్‌నే కోరుకున్నాం. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తే టాస్ ప్రభావం తగ్గించవచ్చని భావించాం. క్యురేటర్ కూడా అదే ఇచ్చారు. మేం మ్యాచ్ గెలిచి ఉంటే పిచ్‌పై ఇంత చర్చ జరిగేది కాదు. మంచి డిఫెన్స్ ఉంటే పరుగులు సాధించవచ్చు. మీరు మానసికగా ఎంత దృఢంగా ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. బవుమా, అక్షర్, సుందర్ పరుగులు రాబట్టారు కదా’ –గౌతమ్ గంభీర్, భారత కోచ్ -
పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్.. టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.గంభీర్ ప్రయోగాలుకోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్ పర్యటన, వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్‌ను తుదిజట్టు నుంచి తప్పించింది.సాయికి బదులుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేసింది. వన్‌డౌన్‌లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.వాషీ పర్లేదుఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్ బౌలింగ్‌లో హార్మర్‌కు క్యాచ్ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.గిల్ స్థానంలో జురెల్ఈ మ్యాచ్‌లో మరో ప్రయోగం... ధ్రువ్ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్‌ను ప్రమోట్ చేశాడు హెడ్‌కోచ్ గౌతం గంభీర్. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఐదో నంబర్ బ్యాటర్ రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.గెలుపు ఆశలు రేపిన అక్షర్మరోవైపు టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. Pressure? What pressure? 🔥#AxarPatel takes the attack to the South African bowlers! 🏏👏#INDvSA | 1st Test, Day 3, LIVE NOW 👉 https://t.co/19cUrY4aXc pic.twitter.com/zpiIumJibl— Star Sports (@StarSportsIndia) November 16, 2025అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్‌లో (34.5)నే బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇక గిల్ ఆబ్సెంట్ హర్ట్ (0) కావడంతో.. ఆలౌట్ అయిన భారత్ ఓటమి ఖరారైంది.టాస్ గెలిచిన.. తొలుత బ్యాటింగ్రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది.ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తెంబా బవుమా హాఫ్ సెంచరీఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా హాఫ్ సెంచరీ (55 నాటౌట్) చేయడంతో ప్రొటిస్ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.తప్పని ఓటమిఅయితే, ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్ నాలుగు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు. ఓపెనర్లను అవుట్ చేసి యాన్సెన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్‌పై గంగూలీ ఫైర్


