తొలి టెస్టులో భారత్ చిత్తు
30 పరుగులతో నెగ్గిన దక్షిణాఫ్రికా
124 పరుగుల ఛేదనలో టీమిండియా 93 ఆలౌట్
సఫారీలను గెలిపించిన స్పిన్నర్లు
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు... పిచ్ ఎలాంటిదైనా కాస్త పట్టుదల కనబరిస్తే సునాయాసంగా ఛేదించగల స్కోరే... కానీ టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలింది...రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్‌కు, ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్ ముందు బ్యాటర్లు తలవంచారు.
మనకు అనుకూలిస్తుందనుకున్న స్పిన్ పిచ్ సఫారీలకు అంది వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన తీరును గుర్తుకు చేస్తూ భారత్ స్వదేశంలో మరో పరాభవాన్ని మూటగట్టుకోగా, వరల్డ్ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు గెలిచి సంబరాలు చేసుకుంది. పదేళ్ల క్రితం అనామకుడిగా ఇక్కడ అడుగు పెట్టి భారత బ్యాటర్ల చేతిలో చావు దెబ్బ తిన్న ఆఫ్‌స్పిన్నర్ సైమన్ హార్మర్ దశాబ్దం తర్వాత ఒక అరుదైన విజయాన్ని రచించడం విశేషం.
కోల్‌కతా: భారత టెస్టు జట్టుకు స్వదేశంలో అనూహ్య షాక్...ఈడెన్ గార్డెన్‌లో స్పిన్ పిచ్ కోరుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన జట్టు చివరకు ప్రత్యర్థి స్పిన్ దెబ్బకే తలవంచింది. ఆదివారం మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో సైమన్ హార్మర్ 4, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు.
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 93/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచ్‌లో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ముందంజ వేయగా, నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగుతుంది. రెండో రోజు మెడకు గాయం కావడంతో ఆట నుంచి తప్పుకొని ఆస్పత్రిలో చేరిన భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ ఆదివారం వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. కోలుకున్న గిల్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ఆదుకున్న బవుమా...
ఆదివారం మైదానంలోకి వచ్చే సమయానికి భారత్ విజయంపై ధీమాగా ఉంది. మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోగా, పదునైన డిఫెన్స్‌తో పట్టుదలగా నిలిచిన బవుమా సింగిల్స్‌తో పరుగులు జోడిస్తూ పోయాడు. కొద్ది సేపు దూకుడుగా ఆడిన కార్బిన్ బాష్ (37 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), బవుమా కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. చివరకు బాష్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా...సిరాజ్ ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు పడగొట్టాడు.
సుందర్ మినహా...
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ (0)ను అవుట్ చేసిన యాన్సెన్, తన రెండో ఓవర్లో రాహుల్ (1)ను పెవిలియన్‌కు పంపి దెబ్బ కొట్టాడు. ఈ దశలో 32 పరుగులు జత చేసి సుందర్, జురేల్ (13) జట్టును ముందుకు నడిపించారు. అయితే జురేల్, పంత్ (2) చెత్త షాట్‌లతో వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలోనూ సుందర్, రవీంద్ర జడేజా (18) భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ సఫారీ స్పిన్నర్లు మళ్లీ పైచేయి సాధించారు.
వీరిద్దరు 8 పరుగుల తేడాతో అవుట్ కాగా, కుల్దీప్ (1) వారిని అనుసరించాడు. గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సాహసం ప్రదర్శించాడు. మహరాజ్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాది 16 పరుగులు రాబట్టాడు. చివరకు మహరాజ్‌దే పైచేయి అయింది. ఐదో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అక్షర్ వెనుదిరగ్గా, తర్వాతి బంతికే సిరాజ్ (0) అవుట్ కావడంలో దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159; భారత్ తొలి ఇన్నింగ్స్ 189; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సుందర్ (సి) హార్మర్ (బి) మార్క్‌రమ్ 31; జురేల్ (సి) బాష్ (బి) హార్మర్ 13; పంత్ (సి) అండ్ (బి) హార్మర్ 2; జడేజా (ఎల్బీ) (బి) హార్మర్ 18; అక్షర్ (సి) బవుమా (బి) మహరాజ్ 26; కుల్దీప్ (ఎల్బీ) (బి) హార్మర్ 1; బుమ్రా (నాటౌట్) 0; సిరాజ్ (సి) మార్క్‌రమ్ (బి) మహరాజ్ 0; గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (35 ఓవర్లలో ఆలౌట్) 93. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–33, 4–38, 5–64, 6–72, 7–77, 8–93, 9–93. బౌలింగ్: యాన్సెన్ 7–3–15–2, హార్మర్ 14–4–21–4, మహరాజ్ 9–1–37–2, బాష్ 2–0–14–0, మార్క్‌రమ్ 3–0–5–1.
బ్యాటింగ్ చేయలేనంత ఇబ్బందికరంగా పిచ్ ఏమీ లేదు. మేం సరిగ్గా ఇలాంటి పిచ్‌నే కోరుకున్నాం. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తే టాస్ ప్రభావం తగ్గించవచ్చని భావించాం. క్యురేటర్ కూడా అదే ఇచ్చారు. మేం మ్యాచ్ గెలిచి ఉంటే పిచ్‌పై ఇంత చర్చ జరిగేది కాదు. మంచి డిఫెన్స్ ఉంటే పరుగులు సాధించవచ్చు. మీరు మానసికగా ఎంత దృఢంగా ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. బవుమా, అక్షర్, సుందర్ పరుగులు రాబట్టారు కదా’
–గౌతమ్ గంభీర్, భారత కోచ్


