దేశవాళీ క్రికెట్‌లో చాలాకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. సొంత జట్టు తరఫున రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ, విజయ్ హజారే వన్డే ట్రోఫీ.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుకున్నాడు.
తాజాగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గోవాతో బుధవారం నాటి మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. యాభై ఆరు బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 75 బంతుల్లో 157 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లతో పాటు ఏకంగా 14 సిక్సర్లు ఉండటం విశేషం.
మరోవైపు.. కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్, మాజీ సారథి దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నిజంగా ఇది సిగ్గుచేటు
‘‘మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలనూ సద్వినియోగం చేసుకున్నాడు. అయినప్పటికీ ఏ ఫార్మాట్‌కు కూడా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను విస్మయానికి గురిచేస్తోంది.
అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిని తరచూ ఇలా ఎలా పక్కనపెట్టగలుగుతున్నారు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో పడిక్కల్‌తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ కీలక సమయంలో 132 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
మిమ్మల్ని మీరే నిందించుకోవాలి
కానీ సెలక్టర్లు ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన ఇద్దరిని పక్కనపెట్టారు. సర్ఫరాజ్ మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ అద్బుతం. మానసికంగానూ అతడు బలవంతుడు.
ఏ ఫార్మాట్లోనైనా.. ఎక్కడైనా చితక్కొట్టగలడు. అలాంటి ఆటగాడిని సెలక్ట్ చేయకుండా.. పరాజయాల పాలైతే వేరే ఎవరినీ మీరు నిందించకూడదు. మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సి ఉంటుంది’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్.. టీమిండియా సెలక్టర్లకు చురకలు అంటించాడు.
కాగా తీవ్ర స్థాయిలో విమర్శల అనంతరం సర్ఫరాజ్ ఖాన్‌ను 2024లో అరంగేట్రం చేయించింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఇప్పటికి ఆరు టెస్టుల్లో కలిపి అతడు 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి?


