టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఉగ్రరూపం దాల్చాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌కు ఆడుతూ హోబర్ట్ హరికేన్స్‌పై విధ్వంసకర శతకం బాదాడు. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఓవరాల్‌గా 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్‌లో మార్ష్‌కు ఇది రెండో శతకం. మార్ష్ తన తొలి బీబీఎల్ శతకాన్ని కూడా హోబర్ట్ హరికేన్స్‌పైనే చేశాడు.
HUNDRED FOR MITCHELL MARSH IN BIG BASH...!!! 🥶
- He is getting ready for the T20 World Cup. pic.twitter.com/Q7hXZpbgWK— Johns. (@CricCrazyJohns) January 1, 2026
తాజా ప్రదర్శనలో భాగంగా మార్ష్ 2000 బీబీఎల్ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ ల్యాండ్ మార్క్‌ను చేరుకున్నాడు. 2011-12 ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన మార్ష్.. బీబీఎల్ కెరీర్‌లో 76 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పైచిలుకు పరుగులు చేశాడు.
తాజా మ్యాచ్‌లో మార్ష్‌తో పాటు ఆరోన్ హార్డీ కూడా చెలరేగాడు. హార్డీ కేవలం 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో హార్డీ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా 5 బౌండరీలు, సిక్సర్ బాదాడు.
మార్ష్ సైతం 14వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. వరుసగా 4,6,6,4 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్, హార్డీ కలిపి 20 బౌండరీలు, 10 సిక్సర్లు బాదారు. వీరి ఊచకోత ధాటికి స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మిగతా స్కార్చర్స్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 16, కూపర్ కన్నోలీ 4, టర్నర్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 2, మిచెల్ ఓవెన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో హరికేన్స్ తడబడుతుంది. 9 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. టిమ్ వార్డ్ (27), మిచెల్ ఓవెన్ (4), మాకలిస్టర్ రైట్ (16), బెన్ మెక్‌డెర్మాట్ (18) ఔట్ కాగా.. నిఖిల్ చౌదరి (17), మాథ్యూ వేడ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. స్కార్చర్స్ బౌలర్లలో జోయల్ పారిస్, ఆరోన్ హార్డీ, ఆస్టన్ అగర్, బ్రాడీ కౌచ్‌కు తలో వికెట్ దక్కింది.ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 66 బంతుల్లో 154 పరుగులు చేయాలి.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళే ప్రకటించారు. ఈ జట్టుకు నాయకుడిగా మిచెల్ మార్ష్‌ను కొనసాగించారు.
టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.


