టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్ తరఫున ఓపెనర్‌గా గిల్ బరిలోకి దిగనున్నాడు.
జైపూర్ వేదికగా సిక్కిం, గోవా జట్లతో పంజాబ్ శని (జనవరి 3), మంగళవారాల్లో (జనవరి 6) ఆడే మ్యాచ్‌లో గిల్ భాగం కానున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. కాగా సౌతాఫ్రికా (IND vs SA)తో ఇటీవల జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లో గిల్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
అనూహ్య రీతిలో వేటు
తొలి టెస్టు సందర్భంగా గాయపడిన గిల్ (Shubman Gill).. సఫారీలతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగు, ఐదో టీ20ల నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.
అంతేకాదు.. అనూహ్య రీతిలో ప్రపంచకప్-2026 జట్టులోనూ గిల్‌కు చోటివ్వలేదు. వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై వేటు వేసి.. టీ20ల నుంచి పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో గిల్ సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని గిల్ భావిస్తున్నాడు.
ఇప్పటికే ఆడేశారు
ఇదిలా ఉంటే.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇప్పటికే ఢిల్లీ, ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు.
టీమిండియా స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ సారథిగా, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర, సర్ఫరాజ్ ఖాన్ ముంబై, దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున దుమ్ములేపుతున్నారు. ఇక అభిషేక్ శర్మ సైతం పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు.
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..
ఈ జాబితాలో ఇప్పుడు గిల్‌తో పాటు వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరనున్నాడు. సర్వీసెస్, గుజరాత్ జట్లతో జనవరి 6,8వ తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం కర్ణాటక తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
త్రిపుర, రాజస్తాన్‌లతో జనవరి 3, 6 తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఇక గిల్‌తో పాటు.. జడేజా, కేఎల్ రాహుల్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. కోహ్లి, రోహిత్‌లతో కలిసి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నారు. సొంతగడ్డపై కివీస్‌తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది.
చదవండి: నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్ చేయరు?


