బ్యాటింగ్‌తో మ్యాచ్‌లు గెలిస్తే.. పటిష్ట బౌలింగ్‌తో సిరీస్‌లు గెలవవచ్చని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా బౌలర్ల సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత టెస్టు జట్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనతో శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.
ఇంగ్లండ్ గడ్డపై బ్యాటర్‌గా అదరగొట్టిన గిల్ (Shubman Gill).. కెప్టెన్‌గా 2-2తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సమం చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో అతడి సారథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్ చేశారు.
అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను బ్యాటర్‌గానే ఎక్కువగా ఆడించింది మేనేజ్‌మెంట్. అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) సేవలను వాడుకున్నప్పటికీ స్థాయికి తగ్గట్లు అతడిని ఉపయోగించుకోలేకపోయింది.
నువ్వు అతడిని నమ్మాలి గిల్
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్.. వీరిద్దరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. నువ్వు వాషింగ్టన్ సుందర్‌పై మరింతగా నమ్మకం ఉంచాలి. ఇలాంటి ఆటగాళ్లకు బౌలింగ్ కూడా మంచినీళ్లప్రాయమే.
తాను అద్భుతంగా బౌలింగ్ చేయగలనని వాషీ భావించడం సహజం. అయితే, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. భారత క్రికెట్.. ముఖ్యంగా టెస్టుల్లో అభివృద్ధి చెందాలంటే వాషింగ్టన్, కుల్దీప్ యాదవ్‌లను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లలో ఆడిస్తూ.. కుదిరినన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించాలి.
బౌలింగ్ పటిష్టంగా ఉంటే..
బ్యాటింగ్‌తో మనం మ్యాచ్‌లు గెలవగలం.. అయితే, బౌలింగ్ పటిష్టంగా ఉంటే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోగలము. మన బౌలర్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కుల్దీప్ యాదవ్‌తో కనీసం 20-25 ఓవర్లు వేయించాలి. అతడి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి’’ అని ఊతప్ప.. వాషీ, కుల్దీప్‌ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. గిల్‌కు సలహాలు ఇచ్చాడు.
కాగా ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో 0-2తో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా.. అనంతరం 2-1తో వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.
చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి?


